సిఎం కేసీఆర్ పాలనలో రాష్ట్రం అధోగతి

Published: Friday September 03, 2021
వికారాబాద్ బ్యూరో 02 సెప్టెంబర్ ప్రజాపాలన : టిఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో రాష్ట్రం అధోగతి పాలయ్యిందని మాజీమంత్రి బిజెపి నాయకుడు ఎ.చంద్రశేఖర్ విమర్శించారు. 14 సంవత్సరాల తెలంగాణ పోరాటంలో ఆత్మబలిదానాల ఫలితంగా రాష్ట్రం సిద్ధించిందని పేర్కొన్నారు. గురువారం మున్సిపల్ పరిధిలోని భృంగి పాఠశాలలో జిల్లా బిజెపి అధ్యక్షుడు తొడిగల సదానంద్ రెడ్డి ఆధ్వర్యంలో విలేఖరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేసీఆర్ రైతుకూలీలను రైతులుగా మారుస్తానని కల్లబొల్లి మాటలతో కప్పిపుచ్చాడని విమర్శించారు. రాష్ట్రం వచ్చిన తరువాత ఇంటికో ఉద్యోగం వస్తుందని ఆశల పల్లకిలో ఊరేగించిన మోసకారి సిఎం కేసీఆర్ అని దెప్పి పొడిచారు. ఉద్యోగం లేని వారికి నిరుద్యోగ భృతి ఇస్తానని చెప్పి కాలం వెళ్ళదీస్తున్నాడని పేర్కొన్నారు. ధరణితో తన స్వంత లాభమే చూసుకున్న గొప్ప మేధావని విమర్శించారు. రైతు బంధుతో భూస్వాములకే ఆర్థకాదాయం పెరిగిందని గుర్తు చేశారు. కౌలు రైతులను నట్టేట ముంచిన ఘనుడు కేసీఆర్ అని చెప్పారు. పోలీస్ డిపార్ట్మెంట్ ను వెట్టచాకిరికి ఉపయోగించుకోవడం సిగ్గు చేటని అన్నారు. ప్రభుత్వ ఖజానాను ఖాళీ చేసి ఓట్లు దండుకుంటున్నాడని ఉద్ఘాటించారు. ఏడున్నర సంవత్సరాల పాలన కాలంలో గ్రామీణ ప్రాంతాల అభివృద్ధిని పట్టించుకోలేదని తూర్పారబట్టాడు. కేంద్రం ఇచ్చిన నిధులతోనే సంక్షేమ పథకాలను కొనసాగిస్తున్నాడని తెలిపారు. కేంద్ర పథకాల పేర్లు మార్చి తన పథకాలుగా చెప్పుకోవడం నీతిమాలిన చర్య అని విమర్శించారు. హుజూరాబాద్ లో దళితుల ఓట్లు ఎక్కువగా ఉండడంతోనే దళిత బంధు పథకాన్ని ప్రవేశ పెట్టాడని ఎద్దేవా చేశారు. ఎక్కడ ఉప ఎన్నికలు జరిగితే అక్కడ మాత్రమే వరాల జల్లు కురుపిస్తాడని దెప్పిపొడిచారు. ఈ సమావేశంలో  కోటిగారి శివరాజ్, పాండుగౌడ్, సాయికృష్ణ, రాఘవన్ నాయక్, తూర్పు రాజేందర్ రెడ్డి, దశరథ్ రెడ్డి, మరాఠి శివప్రసాద్, విజయ్ రాజ్ ముదిరాజ్, ఎల్లారెడ్డి, శ్రీనివాస్ గౌడ్, విజయభాస్కర్ రెడ్డి, మధుసూధన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.