31వ వార్డులో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు

Published: Thursday March 09, 2023
* కౌన్సిలర్ మాలె గాయత్రి లక్ష్మణ్
వికారాబాద్ బ్యూరో 08 మార్చి ప్రజాపాలన : కుటుంబ బరువు బాధ్యతలతో పాటు సామాజికంగా నైతికంగా బాధ్యతలను కూడా చక్కబెట్టే సామర్థ్యం గల మహిళ గొప్ప చాతుర్యత కలిగినదని వికారాబాద్ మున్సిపల్ 31వ వార్డు కౌన్సిలర్ మాలే గాయత్రీ లక్ష్మణ్ అన్నారు. బుధవారం వికారాబాద్ మునిసిపల్ పరిధిలోని శివరాం నగర్ కాలనీకి చెందిన 31వ వార్డులో మహిళా దినోత్సవ వేడుకలను వార్డు కౌన్సిలర్ మాలే గాయత్రి లక్ష్మణ్
 ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని కౌన్సిలర్ మాలే గాయత్రీ లక్ష్మణ్ మాట్లాడుతూ మహిళలకు ఆశలు చిన్నవే కానీ ఆశయాలు చాలా పెద్దవని స్పష్టం చేశారు. ప్రజామోదయోగ్య పనులను అకుంఠిత దీక్షతో నెరవేర్చేందుకు వెనుకాడరని గుర్తు చేశారు. మహిళలు తలుచుకుంటే కుటుంబాన్నే కాకుండా సమాజాన్ని కూడా మార్చగల శక్తి సామర్ధ్యాలు మెండుగా ఉంటాయని తెలిపారు. పుట్టబోయే పిల్లలనుండి కాటికి కాళ్లు చాపే వరకు కంటి పాపల కాపాడుకునే శక్తి ఓర్పు నైపుణ్యం సహనం మహిళలకే సొంతమని చెప్పారు. సమాజోధారణకు పూనుకున్న ప్రతి మహిళ తాను చేపట్టదలుచుకున్న పనులను పూర్తయ్యే వరకు పట్టు వదలని విక్రమార్కుడిలా కృషి చేస్తుందని ఘంటాపతంగా వెల్లడించారు. తన అనుకున్న ప్రతి వారిని రక్షించడంలో వారికి సేవలు అందించడంలో మహిళ అందరికంటే ముందు ఉంటుందని అన్నారు. అందర్నీ కనుపాపలా తలచి, ఆత్మీయత పంచి, తనవారి కోసం అహర్నిశలు కష్టించి, వారిని సహించి, వారి భవిష్యత్ గురించి, తన ఇంటిని నందనవనం చేసే స్త్రీ మూర్తికి పాదాభివందనం అని చెప్పారు. ఈ సందర్భంగా మహిళలందరికి అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.

ఈ కార్యక్రమం లో వార్డు మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.