సిమెంట్ కంపెనీ నిర్మిస్తామని, కంపెనీ స్థానంలో పత్తి పంట ** డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి కార్తీ

Published: Saturday July 30, 2022

ఆసిఫాబాద్ జిల్లా జూలై29(ప్రజాపాలన, ప్రతినిధి) : కేభీ ఆసిఫాబాద్ జిల్లాలోని వాంకిడి మండలంలో గల నవేగాం పంచాయతీ లోని చించోలి గ్రామ శివారులో సిమెంట్ కంపెనీ నిర్మించి, మీకే ఉద్యోగాలు ఇస్తామని, నమ్మించి భూములు తీసుకొని మోసం చేశారని డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి గోడిసెల కార్తీక్ శుక్రవారం విలేకరుల సమావేశంలో తెలిపారు. ఈ సందర్భంగా కార్తీక్ మాట్లాడుతూ 2009 లో రైతులకు శాలివాహన కంపెనీ నిర్మించి ఉద్యోగాలు ఇచ్చామని రైతుల వద్ద నుండి వందల ఎకరాల భూమిని తీసుకున్నారని అన్నారు. సంవత్సరాలు గడుస్తున్నా ఆ కంపెనీ యాజమాన్యం కంపెనీ నిర్మించకుండా ఉద్యోగాల మాట పక్కన పెట్టి, ఇప్పుడు ఆ భూములలో యాజమాన్యమే పత్తి పంటలు వేసుకొని రైతులను మోసం చేస్తున్నారని అన్నారు. ఆ సందర్భంలో అప్పటి కలెక్టర్ చించోలి శివారులో కంపెనీ పెట్టాలని, యాజమాన్యం, రైతులు, అధికారులతో, సమావేశాలు పెట్టి, మీకు మీ పిల్లలకు భవిష్యత్తు ఉందని ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలంటే, మీ భూములను శాలివాహన కంపెనీ యాజమాన్యానికి ఇవ్వాలని కోరడంతో, అమాయక గిరిజనులు ఆశతో భూములను అప్పగించారు. జిల్లా అధికారులు, ప్రభుత్వం వెంటనే చొరవ తీసుకుని ఆ రైతులకు తిరిగి భూములు ఇవ్వాలని,లేదా కంపెనీ నిర్మించి ఆ కుటుంబాలకు ఉద్యోగాలు ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు బోర్కుటే శ్యామ్ రావు, దుర్గం రాజ్ కుమార్ పాల్గొన్నారు.