కలగానే మారుతున్న 30 పడకల ఆస్పత్రి

Published: Tuesday November 30, 2021
కాగజ్‌నగర్‌, నవంబరు 28, ప్రజా పాలన ప్రతినిధి : కాగజ్‌నగర్‌ వాసులకు మెరుగైన వైద్యసేవలు అందించేందుకు ఎల్లాగౌడ్‌ ప్రాథమిక ఆరోగ్య కేంద్ర భవనం పక్కనే 2016లో రూ.4కోట్లతో 30పడకల ఆస్పత్రి నిర్మాణానికి శంకుస్థాపన చేపట్టారు. ఆశయం బాగానే ఉన్నప్పటికీ ఆచరణలో మాత్రం పూర్తిగా విఫలమయ్యారు. కొత్త భవనం నిర్మాణ ప్రక్రియ పూర్తిగా రెండేళ్లలోనే పూర్తి అయ్యే అవకాశాలున్నప్పటికి కూడా నిధులు విడుదల జాప్యం, ఇతర కారణాలు వెరసి పనుల్లో ఏ మాత్రం పురోగతి లేని పరిస్థితి నెలకొంది. ఈ విషయంలో పలుమార్లు అధికారులకు వినతి పత్రాలు సమర్పించినప్పటికీ కూడా ఇంతవరకు పూర్తి కాలేదు. ప్రస్తుతం వైద్య చికిత్సలను కాగజ్‌నగర్‌ ఎల్లాగౌడ్‌ తోటలోని పీహెచ్‌సీలోనే కొనసాగిస్తున్నారు. ఈ భవనం పూర్తిగా శిథిలమైంది. తరుచూ పెచ్చులూడి కింద పడుతున్నాయి. మూడు దశాబ్దాల కిందట నిర్మించిన ప్రాథమిక ఆరోగ్య కేంద్ర భవనంలోనే ప్రస్తుతం వైద్యసేవలను అందిస్తున్నారు. ఈ భవనం పూర్తిగా శిథిలమై ఉంది. కూలేందుకు కూడా సిద్ధంగా ఉంది. చిన్నపాటి వర్షం కురిసిందంటే చాలు పూర్తిగా పెచ్చులూడి కింద పడుతున్నాయి. గతంలో పలుమార్లు పేషంట్‌లతో పాటు సిబ్బందిపై కూడా పడ్డాయి. 12గదులుండగా, ప్రతీ గదిలోనూ స్లాబ్‌ పెచ్చులూడి కింద పడుతోంది. అయినా తప్పనిసరి పరిస్థితుల్లో విధులు నిర్వహించాల్సి వస్తోందని సిబ్బంది పేర్కొంటున్నారు. ఉన్నత అధికారులు స్పందించి 30పడకల ఆస్పత్రి భవన నిర్మాణం పూర్తయ్యేలా చూడాలని అంతా కోరుతున్నారు. కాగా అత్యవసరంగా ప్రస్తుతం ఉన్న పీహెచ్‌సీలో వివిధ శాఖలను కొత్తగా నిర్మిస్తున్న 30పడకల ఆస్పత్రిలోకి తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఆయాశాఖల్లో ఉన్న వివిధ సామాన్లను కూలీలతో తరలిస్తున్నారు. కొత్త భవనంలో కరెంటు సౌకర్యం లేకపోవడంతో తాత్కాలికంగా ఏర్పాటు చేసి విధులు నిర్వహించేందుకు అంతా రంగం సిద్ధం చేస్తున్నారు. రెండేళ్లుగా కొవిడ్‌ వ్యాప్తి ఉండడంతో సిబ్బంది ఆరోగ్య సమస్యలు, మరోవైపు భవన సమస్యలతో నరకం అనుభవించారు. తమకు విధులు నిర్వహించాలంటే చాలా కష్టంగా ఉందని పలువురు పేర్కొన్నారు. అలాగే రోగులు కూడా ఇక్కడి వచ్చినప్పుడు ఎప్పుడు ఏం జరుగుతుందోనని ఆందోళన చెందేవారు. మెరుగైన వైద్యసేవలు అందించేందుకు అవకాశాలున్నప్పటికీ కూడా భవన నిర్మాణ పనుల జాప్యంతో అందరికీ సమస్యలు వస్తున్నాయి. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి భవన నిర్మాణం పూర్తి అయ్యేట్టు చూడాలని వివిధ కాలనీ, మండలాల వాసులు మరియు యూత్ కాంగ్రెస్ నాయకులు డిమాండు చేస్తున్నారు.