ఇంటర్మీడియట్ పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలి

Published: Thursday April 28, 2022
జిల్లా అదనపు కలెక్టర్ మోతిలాల్
వికారాబాద్ బ్యూరో 27 ఏప్రిల్ ప్రజాపాలన : జిల్లాలో ఇంటర్మీడియట్ పరీక్షలు కట్టుదిట్టంగా నిర్వహించడానికి అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని జిల్లా అదనపు కలెక్టర్ మోతిలాల్ సంబంధిత అధికారులను ఆదేశించారు. ఇంటర్ పరీక్షల నిర్వహణపై బుధవారం సంబంధిత అధికారులతో కలెక్టర్ కార్యాలయం లోని కాన్ఫరెన్స్ హాలులో సమీక్ష సమావేశము నిర్వహించారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ ప్రభుత్వము నిర్థేశించిన షెడ్యూలు ప్రకారం పరీక్షలు నిర్వహించుటకు కట్టుదిటమైన ఏర్పాట్లు చేయాలని అన్నారు. మే 6, నుండి 23 వరకు ఇంటర్ పరీక్షలు నిర్వహించనున్నందున తగిన ఏర్పాట్లు చేయాలని తెలిపారు. జిల్లాలో 9,350 ఇంటర్ ప్రథమ సంవత్సరం విద్యార్థులు, 8,215 ఇంటర్ రెండవ సంవత్సరం విద్యార్థులు, మొత్తం 17,565 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరవుతారని తెలిపారు. జిల్లాలో ఇంటర్ పరీక్షల నిర్వహణకు 32 పరీక్షా కేంద్రాలను సిద్ధం చేయడం జరిగిందని అయన తెలిపారు. ప్రభుత్వం ఇంటర్ పరీక్షల నిర్వహణ పై ప్రత్యేక శ్రద్ద వహిస్తుందని విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కల్గకుండా పరిక్షలు రాసేలా అన్ని ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. జిల్లాలో ప్రతి పరీక్ష కేంద్రం వద్ద ఒక ANM తో పాటు వైద్య సిబ్బంది ORS ప్యాకెట్లు అందుబాటులో ఉంచాలని వైద్యారోగ్య శాఖ అధికారిని ఆదేశించారు. జిల్లాలో పరీక్ష ప్రశ్నపత్రాలను   నిల్వజేయుటకు మరియు తరలించేందుకు పోలిసు ద్వారా బందొబస్తు కల్పించాలని సూచించారు. పరీక్ష కేంద్రాల వద్ద పరీక్ష సమయాలలో జిరాక్స్ సెంటర్లు మూసివేయాలని, 144 సెక్షన్ విధించాలన్నారు. తప్పనిసరిగా నిరంతర విద్యుత్ సరఫరా ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని విద్యుత్ అధికారులను కోరారు. పరీక్షలు సజావుగా నిర్వహించేందకు ప్లైయింగ్ స్క్వాడ్, సిట్టింగ్ స్క్వాడ్ ఏర్పాటు చేయాలని రెవిన్యూ అధికారులను ఆదేశించారు. పరీక్షకు ముందు తరువాత విద్యార్థుల సౌకర్యార్థం సకాలంలో బస్సులు నడపాలని అన్నారు. పరీక్షా కేంద్రాల వద్ద మంచి నీరు వుండేలా అధికారులు చూడాలన్నారు. ఈ సమావేశంలో జిల్లా ఇంటర్మీడియట్ నోడల్ అధికారి శంకర్ నాయక్, ఏఎస్పి (డిటీసి) మురళీధర్, డిఎస్పి సత్యనారాయణ, జిల్లా వైద్య అధికారి తుకారం, ఇంటర్మీడియట్ పరీక్ష నిర్వాహకులు బుచ్చయ్య, రాజా మోహన్ రావు, వివిధ శాఖల అధికారులు పాల్గోన్నారు.