తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా గిడుగు రామ్మూర్తి పంతులుకు ఘన నివాళులు

Published: Tuesday August 30, 2022

శేరిలింగంపల్లి- ప్రజాపాలన /ఆగస్ట్ 22 ;పరిధిలో గల న్యూ బ్లూమ్ హై స్కూల్ నందు తెలుగు భాషాదినోత్సవ అవగాహన కార్యక్రమాన్ని సోమవారం ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కన్వీనర్ తాడిబోయిన రామస్వామి యాదవ్ ఆధ్వర్యంలో నిర్వహించారు .ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కేంద్రీయ విశ్వవిద్యాలయం తెలుగు శాఖలోని పూర్వా ఆచార్యులు ఎన్ ఎస్ రాజు హాజరై, గిడుగు వెంకట రామమూర్తి పంతులు చిత్రపటానికి పుష్ప మాలలు వేసి, ఘనంగా నివాళులు అర్పించారు. తదనంతరం విద్యార్థినీ విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ గిడుగు రామమూర్తి పంతులు తెలుగు భాష అభివృద్ధికై ఎనలేని సేవ చేశారని కొనియాడారు. ఆగస్టు 29న తెలుగు భాషా దినోత్సవం అత్యంత వైభవోపేతంగా జరుపుకోవాలని, అందుకు గొప్ప కారణం ఉందని, గిడుగు రామమూర్తి పంతులు నేటి విద్యార్థినీ విద్యార్థులకు అర్థం అయ్యే వ్యావహారిక భాషలో విద్యను అందించడం కోసం, నిరంతర కృషి చేశారని తెలిపారు. రావు బహదూర్ గిడుగు వెంకట రామమూర్తి పంతులు జన్మదినమైన ఆగస్టు 29ని తెలుగు భాషా దినోత్సవంగా ఆశేష తెలుగు సమాజం జరుపుకుంటున్నామని తెలియజేశారు. గిడుగు వెంకట రామమూర్తి పంతులు గ్రాంథిక భాషలో ఉన్న తెలుగు వచనాన్ని ప్రజల నిత్య వ్యవహారిక భాషలో బోధన చేస్తే విద్యార్థులు అందులో ఉన్న సౌలభ్యాన్ని, సులభత్వాన్ని అందుకుని జ్ఞానవంతులు అవుతారని తెలియచెప్పిన మహనీయుడు, బహుభాషా శాస్త్రవేత్త, చరిత్రకారుడు, సంఘసంస్కర్త, హేతువాది, శిష్ట జన వ్యవహారిక భాషను గ్రంథ రచనకు స్వీకరింప చేయడానికి చిత్తశుద్ధిగా కృషిచేసిన అచ్చ తెలుగు చిచ్చర పిడుగు గిడుగు వెంకట రామమూర్తి పంతులని కొనియాడారు. గిడుగు ఉద్యమం వల్ల ఏ కొద్దిమందికో పరిమితమైన చదువు వ్యావహారిక భాషలో సాగి అందరికీ అందుబాటులోకి వచ్చిందని, పండితులకే పరిమితమైన సాహిత్య సృష్టి, సృజనాత్మక శక్తి ఉన్న ప్రతి సామాన్యుడికి వీలైందని తద్వారా అక్షరాస్యత శాతం పెరిగిందన్నారు. ప్రస్తుతం ప్రపంచీకరణ వల్ల తల్లిదండ్రులు తమ పిల్లలను ఆంగ్ల మాధ్యమంలో చదివించడానికి ఆసక్తి చూపుతున్నారని, 27 శాతం మంది పిల్లలు మాత్రమే తెలుగు మాధ్యమంలో చదువుతున్నారని తెలిపారు. సమాజం, తల్లిదండ్రులు గమనించాల్సిన విషయం ఏమిటంటే పిల్లలు చిన్నతనంలో తల్లి భాషలో వినడం, నేర్వడం, చదవడం, ఆకళింపు చేసుకోవడం జరుగుతుందో ఆ వ్యక్తి ఆ భాషలో సులువుగా మాట్లాడగలుగుతారని, తమ భావాలను ఎదుటివారికి అర్థమయ్యేటట్లు చెప్పగలుగుతారన్నారు. భాషాసౌలభ్యాన్ని గుర్తించిన మహనీయులు మన మాతృభాష అయిన తెలుగులో ప్రావీణ్యత సంపాదించగలిగితే, ఆంగ్ల భాషలో కూడా ప్రావీణ్యత సంపాదించడానికి సులువు అవుతుందని, ప్రపంచ ప్రాచీన భాషల్లో తెలుగు భాష ఒకటి అని, మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా ప్రాచీన భాషలు ఒక్కొక్కటి కనుమరుగవుతున్నాయని ఐక్యరాజ్యసమితి నివేదికలు తెలియజేస్తున్నాయని తెలిపారు. కావున మన ప్రాచీన తెలుగు భాషను సంరక్షించుకోవలసిన సామాజిక బాధ్యత తెలుగు వారందరి మీద ఉందన్నారు. అభివృద్ధి చెందిన దేశాలైన జపాన్, కొరియా, చైనా మొదలగు దేశాల్లో వారి మాతృభాషనే అన్ని రంగాలలో వినియోగిస్తున్నారని, తెలుగు భాషలో మరిన్ని పరిశోధనలు జరిపి, శాస్త్ర సాంకేతిక రంగాలలో తెలుగును బలోపేతం చేసి వినియోగించగలిగితే తెలుగు భాష కూడా సజీవంగా సృష్టి ఉన్నంతవరకు నిలిచి ఉండడానికి అవకాశం ఉందని తెలిపారు. ఉదర పోషనార్థం ఆంగ్ల భాషను నేర్చుకున్నా, మన తెలుగు భాషను మరువ వద్దని కోరారు. ఈ సందర్భంగా తెలుగు భాష పై విద్యార్థులు గేయాలు, ఉపన్యాసాలు, నృత్యాలు మొదలగునవి నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హైస్కూల్ కరస్పాండెంట్ యూ.కిరణ్, ఫ్రెండ్స్ వెల్ఫేర్ సభ్యులు వి. ఫణికుమార్, కౌండిన్యశ్రీ నండూరు వెంకటేశ్వరరాజు, విష్ణుప్రసాద్, శివరామకృష్ణ, పాలం శ్రీను, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.