వరిధాన్యం బస్తా తూకం ప్రక్రియ సక్రమంగా నిర్వహించాలి

Published: Saturday December 17, 2022
జిల్లా అదనపు కలెక్టర్ మధుసూదన్ నాయక్
 
మంచిర్యాల బ్యూరో,  డిసెంబర్ 16, ప్రజాపాలన : 
 
ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం వరిధాన్యం కొనుగోలు చేయడం కొరకు జిల్లాలో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగిందని, ఈ క్రమంలో ధాన్యం బస్తా తూకంలో తప్పనిసరిగా 41 కిలోల కాంటా ఉండాలని, జిల్లా అదనపు కలెక్టర్ మధుసూదన్ నాయక్ అన్నారు. శుక్రవారం జిల్లాలోని లక్షెట్టిపేట మండలం ఇటిక్యాల వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించి ధాన్యం బస్తాల కాంటా ప్రక్రియను పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు ధాన్యం తూకం విషయంలో ఖచ్చితంగా వ్యవహరించాలని, కొనుగోలు చేసిన ధాన్యాన్ని ఎప్పటికప్పుడు మిల్లులకు తరలించే విధంగా చర్యలు తీసుకోవాలని తెలిపారు. తేమ, మాయిశ్చర్ నిబంధనలు పాటిస్తూ నాణ్యమైన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తీసుకువచ్చేలా రైతులకు అవగాహన కల్పించాలని తెలిపారు. కొనుగోలు కేంద్రాలకు వచ్చిన రైతులు, వరిధాన్యం వివరాలను ఎప్పటికప్పుడు ట్యాబ్లలో నమోదు చేసి కొనుగోలు సంబంధిత రశీదును రైతులకు అందించాలని, ఆయా రైతులకు ఖాతాలలో నగదు నమోదు చేసే చర్యలు చేపట్టాలని తెలిపారు. అనంతరం యోగేశ్వర్ రైస్ మిల్లును సందర్శించి మిల్లు యాజమాన్యంతో మాట్లాడుతూ కొనుగోలు కేంద్రాల నుండి వచ్చిన ధాన్యాన్ని వెంటనే దిగుమతి చేసుకోవాలని, ఈ మేరకు జిల్లా పౌర సరఫరాల అధికారులు ప్రక్రియను పర్యవేక్షించాలని తెలిపారు.
ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు, కొనుగోలు కేంద్రం నిర్వాహకులు, రైస్ మిల్లు యాజమాన్యం, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.