అభివృద్ధి పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించాలి

Published: Friday December 23, 2022
పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్ సుల్తానియా
వికారాబాద్ బ్యూరో 22 డిసెంబర్ ప్రజా పాలన : ప్రభుత్వం చేపడుతున్న వివిధ అభివృద్ధి పనులను క్షేత్రస్థాయిలో పర్యవేక్షించి పూర్తి చేయాలని పంచాయత్ రాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ సందీప్ సుల్తానియా సూచించారు.
గురువారం హైదరాబాదు నుండి 
 జిల్లాల అదనపు కలెక్టర్లతో జిల్లాల్లో చేపట్టిన వివిధ కార్యక్రమాలపై ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామ పంచాయతీలను అభివృద్ధి దిశగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని ఆయన అన్నారు. రాష్ట్రంలో చేపడుతున్న తెలంగాణకు హరిత హారం, వైకుంఠధామాలు, సెగ్రెగేషన్ షేడ్, తడి, పొడి చెత్త సేకరణ పనులను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని  ఆయన తెలిపారు. జిల్లాల అదనపు కలెక్టర్ లు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచేందుకు కృషి చేయాలన్నారు. పర్యావరణాన్ని పరిరక్షించేందుకు మొక్కలు నాటాలని సూచించారు. హరితహారంలో భాగంగా అన్ని గ్రామ పంచాయతీలలో ప్లాంటేషన్ శాతం పెంచాలని పేర్కొన్నారు. నర్సరీలలో బ్యాగ్ లను మట్టితో నింపి సిద్దం చేయాలని వెల్లడించారు. సీడ్ డబ్లింగ్ వెంటనే పూర్తి చేసేందుకు చర్యలు చేపట్టాలని ఆయన సూచించారు. ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యం మేరకు బృహత్ పల్లె ప్రకృతి వనాలలో మొక్కలు నాటాలని ఆయన అన్నారు. ప్రతి గ్రామం పంచాయితీలలో వైకుంఠ ధామాలలో విద్యుత్, త్రాగు నీరు వంటి సౌకర్యాల ఏర్పాట్లు పూర్తి చేయాలని వివరించారు. అవసరమైన చోట విద్యుత్ కనెక్షన్, నీటి కనెక్షన్ అందజేయాలని  పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి శాఖ డైరెక్టర్ ఎం.హనుమంత రావుకు సూచించారు. గ్రామ పంచాయతీలలో సెగ్రెగేషన్ షెడ్లను ఏర్పాటు చేసి, ఇంటింటికి వెళ్లి తడి, పొడి చెత్త సేకరించి సెగ్రెగేషన్ షెడ్ కి తరలించాలని ఆయన తెలిపారు. తడి చెత్త,  పొడి చెత్త సేకరణపై పంచాయతీ కార్యదర్శులకు అవగాహన కల్పించాలని, ఎప్పటికప్పుడు వాటిని పర్యవేక్షించాలని ఆయన తెలిపారు. జిల్లాలోని అన్ని గ్రామాలను పరిశుభ్రంగా ఉండేలా చర్యలు చేపట్టాలని, మొక్కలతో అందంగా, ఆకర్షణీయంగా తీర్చిదిద్దాలని ఆయన జిల్లా అదనపు కలెక్టర్ లకు ఆదేశించారు. ఈ సందర్భంగా జిల్లా అదనపు కలెక్టర్ రాహుల్ శర్మ మాట్లాడుతూ... జిల్లాలోని 566 గ్రామపంచాయతీలలో 431 తెలంగాణ క్రీడా ప్రాంగణాలను గుర్తించి 403 క్రీడా ప్రాంగణాలను అందుబాటులోకి తెచ్చామని వివరించారు. మిగతావి కూడా వంద శాతం పనులు పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. వైకుంఠధామల్లో నీటి సౌకర్యం లేని వాటిని గుర్తించి సంబంధిత అధికారులతో మాట్లాడి సమకూర్చేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. మిగతా మౌలిక సదుపాయాలు కూడా కల్పించేందుకు చర్యలు చేపడతామని అన్నారు. వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా పరిషత్ సిఈఓ జానకి రెడ్డి , డి.ఆర్.డి.ఓ. కృష్ణన్ జిల్లా పంచాయతీ శాఖ అధికారి తరుణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.