సభ్యత్వం నమోదు లో మంచిర్యాల జిల్లా ఆదర్శం.

Published: Monday January 31, 2022
టిపిసిసి అద్యక్షుడు రేవంత్ రెడ్డి.
మంచిర్యాల బ్యూరో‌, జనవరి30, ప్రజాపాలన : కాంగ్రెస్ పార్టీ ల పెట్టిన డిజిటల్ సర్వే సభ్యత్వ నమోదులో మంచిర్యాల నియోజకవర్గం రాష్ట్రానికే ఆదర్శం అని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు, మల్కాజిగిరి పార్లమెంటు సభ్యుడు రేవంత్ రెడ్డి అన్నారు. శనివారం కేస్లాపూర్ లోని నాగోబా జాతరకు వెళ్తూ మార్గ మధ్యలో మంచిర్యాల లోని మాజీ ఎమ్మెల్సీ కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు నివాసంకు వచ్చారు. ఈ సందర్భంగా పాత్రికేయుల సమావేశంలో రేవంత్ రెడ్డి మాట్లాడారు. మంచిర్యాల నియోజకవర్గం సభ్యత్వ నమోదులో రికార్డు నెలకొల్పడం తనకు సంతోషాన్ని కలిగిస్తోందని అన్నారు.  మంచిరాల నియోజకవర్గంలోని మాజీ ఎమ్మెల్సీ ప్రేమ్ సాగర్ రావు, జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ స్ఫూర్తిని ఆదర్శంగా తీసుకుని అన్ని జిల్లాల్లో నాయకులు కృషి చేస్తే తెలంగాణలో 70 లక్షల పై చిలుకు సభ్యత్వ నమోదు అధిగమించే అవకాశాలు మెండుగా ఉన్నాయని ఆయన అభిప్రాయపడ్డారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా పై తనకు ఎంతో మమకారం ఉందని ఆయన అన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే తప్పకుండా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధిలోకి తీసుకువెళ్లేందుకు కృషి చేస్తానని తెలిపారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా తనకెంతో సెంటిమెంట్ అని ఆయన తెలిపారు. పిసిసి అధ్యక్షుడిగా ఎన్నికైన అనంతరం ఈ విషయాన్ని ప్రేమసాగర్ రావు దృష్టికి తీసుకువెళ్లి  ఇంద్రవెల్లి లో సభ ఏర్పాటు చేయాలని కొరినవేంటనే సభ ఏర్పాటు చేశారని ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఇంద్రవెల్లిలో సభ ఏర్పాటు చేసి విజయవంతంగా పూర్తి చేశారని ఆయన అన్నారు. ఆ స్ఫూర్తితోనే తెలంగాణలో అనేక సభలు నిర్వహించామని ఆయన చెప్పారు. అంతేకాకుండా ఎన్నికల మేనిఫెస్టోలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు అత్యధిక నిధులు కేటాయించేందుకు కు సమ్మతిస్తూ నిర్ణయం తీసుకుంటామని ఆయన తెలిపారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన అనంతరం ముఖ్యమంత్రిగా ఎవరు ఉన్నప్పటికీ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఆదివాసీల అభివృద్ధి సంక్షేమం కాంగ్రెస్ పార్టీ పని చేస్తుందని ఇందులో సంశయం వలదని ఆయన అన్నారు. తుమ్మిడిహెట్టి వద్ద ప్రాజెక్టు నిర్మిస్తే తూర్పు ప్రాంతంలోని నియోజకవర్గాలు సస్యశ్యామల మయ్యేయని ఆయన అన్నారు. తుమ్మిడిహెట్టి వద్ద ప్రాణహిత ప్రాజెక్టు కాకుండా కాళేశ్వరం కట్టడం వల్ల ఈ ప్రాంతం నష్టాన్ని ఎదుర్కొంటుందని ఆయన అన్నారు. రాష్ట్రంలో టిఆర్ఎస్ హవా తగ్గిపోతుందనే ఆందోళనలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నారని రేవంత్ రెడ్డి ఎద్దేవా చేశారు. ఎన్ని పథకాలు ప్రవేశపెట్టినా ఇప్పటికీ ప్రజలు కెసిఆర్ ను ఎన్నికల వ్యవహకర్త ప్రశాంత్ కిషోర్ ను కేసీఆర్ ఆశ్రయించారని ఆయన విమర్శించారు. అంతకుముందు రాజకీయ వ్యూహకర్త ను కాదని కేసీఆర్ ప్రశాంత్ కిషోర్ తో రాజకీయం నెరుపుతున్నారని ఆయన తెలిపారు. ఎప్పుడైతే ఎన్నికల వ్యూహకర్త ను కెసిఆర్ నియమించుకున్నారో అప్పుడే కేసీఆర్ నైతికంగా రాజకీయాల్లో ఓటమి చవిచూసినట్లు అయ్యిందని ఆయన అన్నారు. ముఖ్యమంత్రిగా అధికారంలోకి వచ్చిన కేసీఆర్ అంతకుముందు ఎన్నికల్లో చేసిన హామీలను ఎక్కడా కూడా అమలు చేయడం లేదని ఆయన ధ్వజమెత్తారు. ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యవహరిస్తున్న విధానాల వల్ల రాష్ట్రంలో రైతులు నిరుద్యోగులు ఉద్యోగస్తులు సైతం ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఆయన మండిపడ్డారు. ఇంటికో ఉద్యోగం, కోటి ఎకరాలకు నీళ్లు నిరుద్యోగులకు భృతి, దళితులకు 3 ఎకరాలు మైనారిటీ, గిరిజనులకు 12 శాతం రిజర్వేషన్లు బీడీ కార్మికులకు పింఛన్ ఇలా అనేకమైన హామీలు ఇచ్చిన కేసీఆర్ ఇందులో ఏ ఒక్కటి కూడా అమలు చేయలేదని ఆయన ధ్వజ మెత్తారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ప్రతి ఒక్కరికి ఉద్యోగ ఉపాధి భరోసా ఇస్తుందని ఆయన తెలిపారు. 317 జీవోను ప్రభుత్వం సత్వరమే ఉపసంహరిం చుకోవాలని  డిమాండ్ చేశారు. అనంతరం మాజీ ఎమ్మెల్సీ ప్రేమ్ సాగర్ రావు మాట్లాడుతూ ఆదిలాబాద్ జిల్లా ఎంతో వెనుకబాటుతనాన్ని ఎదుర్కొం టోందని అన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలని ఆయన రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి చేశారు. జిల్లాలో అనేక ఖనిజ వనరులు ఉన్నాయని వాటిని వినియోగించడంలో విఫలమయ్యారని ఆయన పేర్కొన్నారు. ఈ సమావేశంలో జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ, ములుగు ఎమ్మెల్యే సీతక్క, తదితరులు పాల్గొన్నారు.