పట్లూరులో దేశ్ ముఖ్ భూములు దొంగ రిజిస్ట్రేషన్లు

Published: Tuesday August 17, 2021
దళారుల చేతికి చిక్కిన పట్లూరు దేశ్ ముఖ్ భూములు
తాతముత్తాతలు కొన్న భూములలో సాగు చేస్తున్న రైతులకు తెలియకుండా భూ విక్రయాలు 
వికారాబాద్ బ్యూరో 16 ఆగస్ట్ ప్రజాపాలన : వ్యవసాయ భూముల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. తెల్ల కాగితాల ఆధారంగా కొన్న భూములు, పట్టాకాని భూములు, చిక్కు ముడులు ఉన్న భూములపై దళారుల డేగకన్ను పడుతుంది. సమస్యలతో ఉన్న భూముల ఆరా తీయడానికి దళారులకు వెన్నతో పెట్టిన విద్యగా మారింది. రెవెన్యూ కార్యాలయాల చుట్టూ చకోరా పక్షుల్లా తిరిగి అధికారులను ప్రసన్నం చేసుకుంటున్నారు. అధికారులు ప్రసన్నమైతే దళారులకు కాసుల పంటే. సోమవారం వికారాబాద్ కలెక్టరేట్ ముందు భాగంలో దేశ్ ముఖ్ భూముల బాధితులు ధర్నా నిర్వహించి కలెక్టర్ కు వినతి పత్రం అందజేశారు. అందులో భాగంగానే వికారాబాద్ నియోజకవర్గంలో గల మర్పల్లి మండలానికి చెందిన పట్లూరు గ్రామంలోని దేశ్ ముఖ్ భూములపై దళారుల కన్నపడింది. దేశ్ ముఖ్ లకు చెందిన భూములు పట్టా అయినవి కానివి పూర్తి వివరాలను దళారులు తెలుసుకున్నారు. లొసుగులను భూతద్దంలో చూసి మరీ వెతికి పట్టుకున్నారు. పట్లూరు గ్రామంలోని దేశ్ ముఖ్ కు చెందిన భూములు సర్వే నంబర్ 230అ/3 లో 13.18 ఎకరాలు, 231అ/3/2 లో 14.20 ఎకరాల భూములను సిరిపురం సాయన్న, సిరిపురం మల్లయ్య, సిరిపురం అడివయ్య, సిరిపురం ఎల్లప్పలు స్వాతంత్ర్యం రాక పూర్వం సుమారు 110 సంవత్సరాల క్రితం ముస్లిం జాగీరుదారుల (దేశ్ ముఖ్ లు) నుండి కొన్నారు. సర్వే నంబర్ 236 లో అంశెట్ మాకుల నర్సిములు, అంశెట్ మాకుల శంకరయ్య, అంశెట్ మాకుల పాపయ్యలు 17.30 ఎకరాల భూమి కొన్నారు. అప్పటి నుండి ఇప్పటి వరకు భూమిని నమ్ముకొని సాగుచేసుకుంటూ జీవనం గడుపుతున్నారు. ముస్లిం జాగీర్ దారులు (దేశ్ ముఖ్ లు) భూములను అమ్మి పాకిస్తాన్ కు వెళ్ళారని భూసాగుదారులు చెబుతున్నారు. దేశ్ ముఖ్ ల వారసులు ఉన్నారని దళారులు అబద్ధం చెబుతున్నారని ఆరోపించారు. దళారులు మాయమాటలతో అబద్ధపు దేశ్ ముఖ్ వారసులచే మేము సాగు చేసుకుంటున్న భూములను మాకు తెలియకుండా అమ్మారని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మా తాత ముత్తాతల నుండి వచ్చిన భూమిలో సాగు చేసుకుంటున్న మాపై అన్యాయంగా బెదిరింపులకు పాల్పడుతున్నారు. సంబంధిత అధికారులు పట్లూరు గ్రామానికి వచ్చి విచారణ జరిపి న్యాయం చేయాలని కోరుతున్నారు.