అనంతగిరి టీబీ ఆసుపత్రిలో కోవిడ్ రోగులకు మెరుగైన వైద్య చికిత్స : జిల్లా కలెక్టర్ పౌసుమి బసు

Published: Thursday May 20, 2021
వికారాబాద్, మే 19, ప్రజాపాలన బ్యూరో : అనంతగిరి టీబీ ఆసుపత్రిలో కోవిడ్ రోగులకు మెరుగైన వైద్య చికిత్సను అందించేందుకు అవసరమైన అన్ని మౌలిక సదుపాయాల కొరకు ఏర్పాట్లను త్వరతగతిన పూర్తి చేయాలని సంబంధిత అధికారులను జిల్లా కలెక్టర్ పౌసుమి బసు ఆదేశించారు. బుధవారం కలెక్టర్ అనంతగిరి టీబీ ఆసుపత్రిని సందర్శించి ఏర్పాట్లపై అధికారులతో సమీక్షించారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ ఆసుపత్రికి అవసరమైన కొత్త మరుగుదొడ్ల నిర్మాణపు పనులను చేపట్టి వెంటనే పూర్తి చేయాలన్నారు.  విద్యుత్, నీటి సరఫరా అంతరాయం లేకుండా అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా చేపట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.  ఆసుపత్రిలో నిరూపయోగంగా ఉన్న కోవిడ్ టెస్టింగ్ యంత్రాన్ని వినియోగంలోకి తేవాలని సూచించారు. కోవిడ్ రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ఏర్పాట్లు అన్ని త్వరగా పూర్తి చేయాలని వైద్య అధికారులకు ఆదేశించారు. అనంతరం అనంతగిరి జిల్లా వైద్య అధికారి కార్యాలయంలోని స్టోర్ రూమ్ ను సందర్శించి పరిశీలించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ చంద్రయ్య, జిల్లా వైద్య అధికారి సుధాకర్ షిండే, డాక్టర్ అరవింద్, ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్ యాదయ్య, డాక్టర్ శాంతప్ప , డాక్టర్ ప్రదీప్, డాక్టర్ వినోద్ శిస్టర్ సంధ్య టిఎస్ఎంఎస్ఐడిసి డిఈ రవీందర్, ఆర్ అండ్ బి, విద్యుత్ శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు.