సిద్ధిపేట బిజెపిలో సమూల ప్రక్షాళన అవసరమా?

Published: Wednesday June 16, 2021

పార్టీలోని కోవర్టుల వల్ల అధికార పార్టీ లాభపడుతుందన్న భావనలో కార్యకర్తలు !!!
సిద్దిపేట (ప్రజాపాలన ప్రతినిధి) : కేంద్రంలో అధికారం, రాష్ట్రంలో డైనమిక్, దూకుడు స్వభావం గల అధ్యక్షుడు ఇంతగా సహకారం లభిస్తే ఏ ప్రతిపక్ష పార్టీ కార్యకర్త అయినా స్వేచ్ఛగా పనిచేస్తాడు, అధికార పార్టీని ప్రశ్నించడంలో ముందుంటాడు, అలాంటిది సిద్ధిపేట జిల్లాలో బిజెపి పరిస్థితి చూస్తే ఇందుకు పూర్తి విరుద్ధంగా ఉంది. స్వభావికంగానే బిజెపి పార్టీలో యువత ఎక్కువ, అలాంటి యువత ఎక్కడ అవినీతి జరిగినా ప్రశ్నించడంలో ముందుంటారు. సిద్ధిపేట జిల్లాలో కూడా బిజెపి పార్టీలో యువత ను సరైన దారిలో నడిపించే నాయకుడు లేకనో లేక పార్టీలో అధికార పార్టీకి కోవర్టులుగా పనిచేసే నాయకులు ఎక్కువ కావడం వల్లనో పార్టీ అనుకున్నంతగా ముందుకెళ్లలేక పోతుందన్నది వాస్తవం. మొన్న మున్సిపల్ ఎన్నికలలో అధికార పార్టీ అవినీతికి పాల్పడిందని రాష్ట్ర నాయకత్వం దగ్గరనుండి జిల్లా నాయకత్వం వరకు అందరూ ప్రచారం చేశారు. కానీ ఆ అవినీతి ఏంటో బయటపెట్టడానికి కనీస ప్రయత్నం కూడా చేసిన దాఖలాలు లేవు అంటున్నారు విశ్లేషకులు. ఇదిలా ఉండగా బిజెపి ఈ పరిస్థితికి కారణం ఆ పార్టీలోని కొంతమంది నాయకులు అధికార పార్టీకి కోవర్టులుగా పనిచేస్తున్నారన్న వాదన ప్రజలలో, ఆ పార్టీ కార్యకర్తలలో ఉండడం వలన అగ్రెసివ్ గా పనిచేసే వారు సైతం మెత్తబడి పనిచేయాల్సి వస్తుందన్నది మరో వాదన. రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ దూకుడులో కనీసం సగం అయినా సిద్ధిపేట జిల్లా నాయకత్వానికి ఉంటె బావుండన్నది కార్యకర్తల మనోభీష్టంలా కనిపిస్తుందంటున్నారు ప్రజానీకం. ఇకనైనా జిల్లాలో బిజెపి తన పంథా మార్చుకుంటుందేమో చూడాల్సిందే ...