ఎస్సీ కార్పొరేషన్ రుణాలు మంజూరు చేయాలి : మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు జి.చెన్నయ్య

Published: Thursday September 23, 2021
హైదరాబాదు 22 సెప్టెంబర్ ప్రజాపాలన : ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర మాల మహానాడు కార్యవర్గం ఎన్నిక. బుధవారం నాడు విజయవాడ గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో మాల మహానాడు జాతీయ అధ్యక్షులు  జి చెన్నయ్య సమక్షంలో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర మాల మహానాడు ముఖ్య కార్య కర్తల సమావేశం సిటీ అధ్యక్షుడు బొమ్మల సురేష్ బాబు అధ్యక్షతన జరిగిందన్నారు. ఈ సందర్బంగా జి చెన్నయ్య మాట్లాడుతూ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో రుణాల కోసం దరఖాస్తులు సమర్పించి, రుణాల కోసం ఎదురు చూస్తున్న ఎస్సి లబ్దిదారులకు రుణాలు మంజూరు చేయాలనీ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. ష్యూరిటీ లేకుండా, బ్యాంకులతో లింకు లేకుండా ప్రభుత్వమే నేరుగా రుణాలు అందించాలని చెన్నయ్య డిమాండ్ చేశారు. ఎస్సి లకు కేంద్రం నుంచి వచ్చే నిధులను, సబ్ ప్లాన్ నిధులను దారి మళ్లించకుండా ప్రతీ రూపాయి ఎస్సి  సంక్షేమానికే ఖర్చు చేయాలన్నారు. ఎస్సి ల సమగ్ర అభివృద్ధికి దోహదపడాలని చెన్నయ్య సూచించారు. వచ్చే ఏడాది బడ్జెట్టులో ఎస్సి ల సంక్షేమానికి రెట్టింపు నిధులు కేటాయించి మాల, మాదిగ మరియు రెల్లి కార్పొరేషన్ లకు నిధులు సమకూర్చి ఎస్సి ల అభివృద్ధి జరిగేలా ప్రణాళికలు చేయాలన్నారు. ఆ నిధులను ఆయా కులాలకే ఖర్చు చేయాలనీ చెన్నయ్య ప్రభుత్వాన్ని కోరారు. అదేవిధంగా ఈ సమావేశంలో మాల మహానాడు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా సిహెచ్ కళ్యాణ్, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర మాల మహానాడు వర్కింగ్ ప్రెసిడెంటుగా కళ్ళుపోతుల సురేష్, మాల మహానాడు విజయవాడ నగర వర్కింగ్ వర్కింగ్ ప్రెసిడెంటుగా బొమ్మల నరేష్, ఆంధ్ర ప్రదేశ్ మాల మహానాడు ప్రధాన కార్యదర్శిగా వై పి కృష్ణ మోహన్ లను నియమించారు. వారికి నియామక పత్రాన్ని అందజేశారన్నారు. ఈ కార్యక్రమంలో మాల మహానాడు తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు తాళ్లపల్లి రవి, మాల మహానాడు జాతీయ ప్రధాన కార్యదర్శి వడాల భస్కర్, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కే సురేష్, కృష్ణ మోహన్, చందరపు కళ్యాణ్, మాల మహానాడు యూత్ అధ్యక్షులు జి రమేష్ తదితరులు పాల్గొన్నారు.