క్రైస్తవుల స్వచ్ఛంద బొట్టుదారణ కార్యక్రమాన్ని విజయవంతం చేయండి

Published: Tuesday February 15, 2022
రాష్ట్రీయ క్రైస్తవ పరిషత్ అధ్యక్షుడు అద్దంకి రంజిత్ ఓఫిర్
హైదరాబాద్ (ప్రజాపాలన ప్రతినిధి) : దేశ చరిత్రలో కనీవినీ ఎరుగని క్రైస్తవ స్వచ్ఛంద బొట్టుదారణ కార్యక్రమాన్ని నిజాంపేటలోని అగాపే ఫుల్ చర్చిలో నిర్వహించ నున్నట్లు రాష్ట్రీయ క్రైస్తవ పరిషత్ అధ్యక్షుడు అద్దంకి రంజిత్ ఓఫిర్ తెలిపారు. దేశంలో క్రైస్తవులు హిందువులకు వ్యతిరేకం అన్న అపవాదు తొలగించేందుకు వెయ్యి మంది మహిళలతో బొట్టు ధారణ కార్యక్రమం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించేందుకు ఏర్పాటు చేశామన్నారు. భారతీయ స్త్రీలు భారతీయ స్త్రీ లాగానే ఉండాలనే సదుద్దేశంతో బొట్టు లేకపోవడం వల్ల కుటుంబాలలో జరుగుతున్న అలజడులను తగ్గించేందుకు రాష్ట్రీయ క్రైస్తవ పరిషత్ ఆధ్వర్యంలో సామూహిక బొట్టు ధారణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ముఖ్యంగా ఇష్టమైన మతాన్ని పాటిస్తున్న మహిళలు బొట్టు లేకపోవడం వల్ల ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించే లక్ష్యంతో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు తెలిపారు. సుమారు వెయ్యి మంది వరకు మహిళలు ఈ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం ఉందని చెప్పారు. తాము ఎవరినీ బలవంతం చేయడం లేదని స్వచ్ఛందంగా ముందుకు వచ్చే వారికి మాత్రమే ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం చేస్తున్నట్లు తెలిపారు. అన్ని మతాల లోని మేధావులు ఈ కార్యక్రమానికి మద్దతు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఆయన తో పాటు పలువురు రాష్ట్రీయ క్రైస్తవ పరిషత్ మహిళామణులు పాల్గొన్నారు.