నీట్ పరీక్షను సమర్థవంతంగా నిర్వహించాలి. జిల్లా అదనపు కలెక్టర్ మధుసూదన్ నాయక్ మంచిర్యాల బ్య

Published: Tuesday July 12, 2022
జిల్లాలో ఈ నెల 17న జరుగనున్న నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ (నీట్) యు.జి. -2022 పరీక్షను సంబంధిత శాఖల అధికారులు సమర్థవంతంగా నిర్వహించాలని జిల్లా అదనపు కలెక్టర్ మధుసూదన్ నాయక్ అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ భవన సముదాయంలోని జిల్లా అదనపు కలెక్టర్ చాంబర్లో పరీక్ష నిర్వహణపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ ఈ నెల 17వ తేదీ మధ్యాహ్నం 2 గం||ల నుండి సాయంత్రం 5.20 గం||ల వరకు నీట్-2022 పరీక్ష నిర్వహించడం జరుగుతుందని, ఇందు కోసం జిల్లాలో కార్మెల్ కాన్వెంట్ హైస్కూల్-సి.బి.ఎన్.ఈ., కార్మెల్ కాన్వెంట్ హైస్కూల్-స్టేట్, ఉషోదయ హైస్కూల్, ట్రినిటీ హైస్కూల్లో పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. పరీక్ష సమయంలో కేంద్రాల సమీపంలోని జిరాక్స్ సెంటర్లు మూసి ఉ ంచాలని, పరీక్ష కేంద్రాల వల్ల 144 సెక్షన్ అమలు చేయడంతో పాటు పోలీసు శాఖ అధికారులు అవసరమైన బందోబస్తు ఏర్పాటు చేయాలని తెలిపారు. జిల్లా వైద్యా, ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి సిబ్బందిని అందుబాటులో ఉంచాలని, విద్యుత్ సరఫరాలో ఎలాంటి అంతరాయం లేకుండా విద్యుత్ శాఖ అధికారులు తగు చర్యలు తీసుకోవాలని తెలిపారు. మున్సిపల్ అధికారులు పరీక్ష కేంద్రాలలో పారిశుద్ధ్య నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించాలని, త్రాగునీరు, ఇతరత్రా మౌళిక సదుపాయాలు ఏర్పాటు చేయాలని, ఇంటర్నెట్ వినియోగంలో ఎలాంటి ఇబ్బంది లేకుండా నిరంతరాయంగా వచ్చేలా సంబంధిత అధికారులు తగు చర్యలు తీసుకోవాలని తెలిపారు.

ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి, మున్సిపల్ కమీషనర్, పరీక్ష కేంద్రాల పర్యవేక్షకులు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.