బంగారం వ్యాపారం పారదర్శకం చేసేందుకు పన్నులు తగ్గించండి

Published: Tuesday February 01, 2022
కేంద్రానికి మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ చైర్మన్ ఎంపి.అహమ్మద్ విజ్ఞప్తి
హైదరాబాద్ (ప్రజాపాలన ప్రతినిధి) : బంగారం అక్రమ రవాణాను నియంత్రించేందుకు, ఆభరణాల వ్యాపారాన్ని మరింత పారదర్శకం చేసేందుకు రాబోయే కేంద్ర బడ్జెట్లో బంగారంపై దిగుమతి సుంకాన్ని తగ్గించే అంశాన్ని కేంద్ర ఆర్థిక మంత్రి పరిశీలించాలని మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ చైర్మన్ ఎంపి అహమ్మద్ విజ్ఞప్తి చేశారు. దేశ వ్యాప్తంగా బంగారం స్మగ్లింగ్ కార్యకలాపాలు పెరగడానికి అధిక దిగుమతి సుంకం ప్రధాన కారణమని అభిప్రాయపడ్డారు. 7.5 శాతం కస్టమ్స్ డ్యూటీతో కలిసి బంగారం దిగుమతులపై మొత్తం సుంకం 10.75 శాతం ఉందన్నారు. ఈ కారణంగా బంగారం స్మగ్లింగ్ లాభదాయకమైన వ్యాపారంగా మారిందన్నారు. బంగారంపై దిగుమతి సుంకాన్ని తగ్గించడంతో పాటు, బంగారంపై విధించే అన్ని రకాల సుంకాలను కూడా ఆర్థిక మంత్రి తొలగించాలన్నారు. దిగుమతి సుంకం, జి.ఎస్.టి రేట్లను తగ్గించడం, హాల్ మార్క్ యూనిక్ ఐడెంటిఫికేషన్ (హెచ్.యూ.ఐ.డి) తప్పనిసరి చేయడం, వ్యాపారంలో పారదర్శకత, 100 శాతం పన్ను సమ్మతిని నిర్ధారించడం ద్వారా దేశీయ మార్కెట్లో ప్రభుత్వం తీవ్రమైన మార్పులను తీసుకురాగలదన్నారు.