ఎమ్మెల్సీ ఓటు ఎలా వేయాలి...?

Published: Saturday March 13, 2021
ఖమ్మం, మర్చి 12, ప్రజాపాలన ప్రతినిధి : ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు ఎలా వేయాలని సందిగ్ధం లో అనేకమంది ఉన్నారు. సాధారణ ఎన్నికలకు భిన్నంగా ఎమ్మెల్సీ ఓటు వేసే విధానం ఉంటుంది. ప్రాధాన్యతా నంబరే ప్రధానం ప్రాధాన్యక్రమంలో అభ్యర్థులందరికీ ఓటువేసే అవకాశం ఉంది. చెల్లిన ఓట్లలో 50 శాతం కంటే ఎక్కువ వస్తేనే అభ్యర్థి విజయం సాధిస్తాడు. ఇప్పటివరకు జరిగిన ఏ ఎన్నికల్లోనూ ఫలితం 1తో తేలలేదు.. 2 దాటలేదు  సాధారణ ఎన్నికల పోలింగ్‌కు పూర్తి భిన్నం ఎమ్మెల్సీ ఓటింగ్‌. సాధారణ ఎన్నికల బరిలో నిలిచినవారిలో ఒక్కరికి మాత్రమే ఓటేస్తాం. కానీ, ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీచేస్తున్న అభ్యర్థుల్లో ఎంతమందికైనా ఓటువేసే అవకాశం ఉంటుంది. ఓటర్లు ఇచ్చే ప్రాధాన్యతా నంబరే గెలుపోటములను నిర్ణయిస్తుంది. ఓట్ల లెక్కింపునకే కనీసం రెండురోజులు పడుతుందంటే ఉత్కంఠ ఏస్థాయిలో ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. సరైన అవగాహన లేకుండా ఓటుహక్కు వినియోగించుకుంటే ఒక్కోసారి అది చెల్లుబా టు కాకపోగా  ఎంపికచేసుకున్న అభ్యర్థి విజయంపై కూడా ప్రభావం చూపుతుంది. రాష్ట్రంలో రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గాలకు ఈ నెల 14న పోలింగ్‌ జరగనున్నాయి. హైదరాబాద్‌- మహబూబ్‌నగర్‌- రంగారెడ్డి, వరంగల్‌- ఖమ్మం- నల్లగొండ పట్టభద్రుల స్థానాలకు జరుగుతున్న ఎన్నికల్లో ఈసారి భారీ సంఖ్యలో అభ్యర్థులు బరిలో నిలిచారు. ‘హైదరాబాద్‌' నుంచి 93 మంది, ‘వరంగల్‌' నుంచి 71 మంది పోటీచేస్తున్నారు. అభ్యర్థులందరి పేర్లతోపాటు, నోటా కూడా కలిపి ఎన్నికల్లో జంబో బ్యాలెట్‌ను వినియోగిస్తున్నారు. న్యూస్‌ పేపర్‌ పరిమాణంలో ఈ బ్యాలెట్‌ పేపర్‌ ఉండనున్నది. ప్రాధాన్యతాక్రమంలో అభ్యర్థులందరికీ ఓటువేసే అవకాశం ఉండటంతో ఓటింగ్‌పై ముందుగానే అవగాహన కలిగి ఉండటం ఎంతైనా అవసరం. లేకపోతే ఓటు వృథా అయ్యే ప్రమాదం ఉంటుంది.