ఇంటర్మీడియట్ పరీక్షలను సజావుగా నిర్వహించాలి ** రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి

Published: Tuesday March 14, 2023
ఆసిఫాబాద్ జిల్లా మార్చి13
(ప్రజాపాలన,ప్రతినిధి) :
ఈ నెల 15 నుండి ఏప్రిల్ 4 వరకు రాష్ట్రవ్యాప్తంగా జరగనున్న ఇంటర్మీడియట్ పరీక్షలను అధికారులు ప్రశాంత వాతావరణంలో సజావుగా నిర్వహించాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. సోమవారం హైదరాబాద్ నుండి ఇంటర్ కార్యదర్శి నవీన్ మిట్టల్,రాష్ట్ర విద్యాశాఖ ఉన్నతాధికారులతో కలిసి జిల్లా కలెక్టర్లు, ఎస్పి.లు, ఇంటర్మీడియట్ విద్యాధికారులు,సంబంధిత అధికారులతో ఇంటర్ పరీక్షల నిర్వహణపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర విద్యాశాఖ మంత్రి మాట్లాడుతూ ఈ నెల 15 నుండి ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రారంభం కానున్నాయని, జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో జిల్లా అధికార యంత్రాంగం పరీక్షలను సజావుగా నిర్వహించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని, విద్యార్థిని విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పరీక్ష కేంద్రాల వద్ద పోలీసు బందోబస్తు, వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలని,144 సెక్షన్ అమలు చేస్తూ పరీక్ష కేంద్రానికి సమీపంలోని జిరాక్స్ సెంటర్లలో మూసి ఉంచే విధంగా అధికారులు పర్యవేక్షించాలని తెలిపారు.జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ భవనంలో గల వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుండి జిల్లా కలెక్టర్ బొర్కడే హేమంత్ సహదేవరావు, జిల్లా అదనపు కలెక్టర్ చాహత్ బాజ్ పాయి, ఎస్పి సురేష్, ఇంటర్మీడియట్ విద్యాధికారి శ్రీధర్ సుమన్ తో కలిసి వీడియో కాన్ఫరెన్స్ కు హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో నిర్వహించనున్న ప్రధమ ద్వితీయ సంవత్సరం ఇంటర్మీడియట్ పరీక్షలకు అన్ని ఏర్పాట్లతో సిద్ధంగా ఉన్నామని తెలిపారు. విద్యార్థులు నిర్భయంగా పరీక్షలు రాయాలని, విద్యార్థుల్లో మానసిక ఒత్తిడి తగ్గించి వారిలో ఉన్న భయాన్ని పోగొట్టడానికి ప్రభుత్వం టెలీ మానస్ 14416 టోల్ ఫ్రీ  నంబర్ ద్వారా సేవలందిస్తుందని తెలిపారు. జిల్లాలో ఇంటర్ విద్యార్థులు మొత్తం 9933 మందిలో జనరల్ 8457, ఒకేషనల్ విభాగంలో 1476 మంది పరీక్షకు హాజరు కానున్నారని,  ఇందులో ప్రథమ సం. పరీక్షకు 5135 విద్యార్థులు,ద్వితీయ సం. పరీక్షకు 1478 మంది విద్యార్థులు ఉన్నారని తెలిపారు. పరీక్షల నిమిత్తం 20 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగిందని, ఇందులో 11 ప్రభుత్వ, 6 ప్రభుత్వ రంగ, 3 ప్రైవేటు కళాశాలలు ఉన్నాయని తెలిపారు. పరీక్షలకు హాజరయ్యే విద్యార్థిని, విద్యార్థులకు  మౌళిక సదుపాయాలు కల్పించడం జరిగిందని, పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్‌ అమలు, సమీపంలోని జిరాక్స్‌ సెంటర్లను మూసి ఉంచేలా చర్యలు చేపట్టామని, త్రాగునీటి వసతి కల్పించామని తెలిపారు. ప్రతి పరీక్ష కేంద్రం వద్ద ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలో వైద్య అధికారులు, సిబ్బందిని నియమించి, అవసరమైన మందులు, ఓ. ఆర్‌.ఎస్‌. ప్యాకెట్లు, హెల్త్‌ కిట్లను అందుబాటులో ఉంచామని, జిల్లాస్థాయిలో జిల్లా ఇంటర్మీడియట్ విద్య అధికారి కార్యాలయంలో కంట్రోల్ రూమ్ 08733-293713 నెంబర్ ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఆర్డి ఓ రాజేశ్వర్, డిఎస్పి లు శ్రీనివాస్, కరుణాకర్, డిఈసి. సభ్యులు నైతం శంకర్, సి.హెచ్ తిరుపతి సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.