అంగవైకల్యం శరీరానికి కానీ మనసుకు కాదు

Published: Saturday November 26, 2022
జిల్లా అదనపు కలెక్టర్ రాహుల్ శర్మ
వికారాబాద్ బ్యూరో 25 నవంబర్ ప్రజా పాలన : అంగవైకల్యం అనేది శరీరానికే గాని మనస్సుకు కాదని క్రీడలలో పాల్గొంటున్న దివ్యాంగులు తమ ప్రతిభను కనబరిచి నిరూపించాలని జిల్లా అదనపు కలెక్టర్ రాహుల్ శర్మ, ఐఏఎస్ అన్నారు. 
 శుక్రవారం వికారాబాద్ పట్టణంలోని బ్లాక్ గ్రౌండ్స్ లో మహిళా, శిశు, వికలాంగులు, వయోవృద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా వివిధ క్రీడా పోటీలను జిల్లా అదనపు కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,  డిసెంబర్ 3న అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం పురస్కరించుకొని  వికారాబాద్ జిల్లాలోని దివ్యాంగులందరికీ  జిల్లా స్థాయి దివ్యాంగుల ఆటల పోటీలు నిర్వహించడం  చాలా సంతోషించదగ్గ విషయమని అన్నారు. దివ్యాంగులు ఎవరిపైనా ఆధారపడకుండా తమ కాళ్లపై తామే నిలబడాలని కోరుకోవడమే కాక వారిలో ఉన్న ఆత్మ స్థైర్యానికి ఇలాంటి ఆటల పోటీలు నిర్వహించడం మంచి నిదర్శనమని అన్నారు.   ప్రభుత్వం మహిళా శిశు సంక్షేమ శాఖ తరపున దివ్యాంగులను అవసరమైన సదుపాయాలను కల్పిస్తూ వారిని అన్ని విధాలా ఆదుకోవడం జరుగుతుందని తెలిపారు. దివ్యాంగులకు తాను చేతనైన సాయం అందించడానికి ఎల్లప్పుడూ ముందుంటానని ఈ సందర్భంగా తెలియజేశారు. జిల్లా సంక్షేమ అధికారిణి లలిత కుమారి మాట్లాడుతూ ఈరోజు సుమారు 120 మంది  దివ్యాంగులకు మహిళా శిశు సంక్షేమ శాఖ తరపున జిల్లా స్థాయి ఆటల  పోటీలు నిర్వహించడం జరుగుతుందని, ఇలాంటి  కార్యక్రమాలు నిర్వహించడం వల్ల దివ్యాంగులు కూడా అందరితో పాటు సమానమని వారిలో ఉన్న వివక్షతను తొలగించడానికి ఇలాంటి కార్యక్రమాలు  దోహదపడతాయని తెలిపారు. మహిళ శిశు సంక్షేమ  శాఖ తరపున దివ్యాంగులకు అన్ని విధాలుగా సహకారం అందించడం జరుగుతుందని, దివ్యాంగులకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున  అందించే ప్రోత్సాహకాలు నాయబద్ధంగా అందే విధంగా కృషి చేయడం జరుగుతుందని అన్నారు.  కొంతమంది దివ్యాంగులకు ఇంతకుముందు స్వయం శక్తితో ఎదగడానికి రుణ సదుపాయం, విద్యార్థులకు స్మార్ట్ ఫోన్లు, ల్యాప్ టాప్ లు అందజేయడం జరిగిందని తెలియజేశారు.  శుక్రవారం దివ్యాంగులను  జూనియర్స్ ( 10 నుంచి 16 సంవత్సరాలు ) , సీనియర్స్ ( 17 నుంచి 54 సంవత్సరాలు ) రెండు విభాగాలుగా విభజించి  ఆటల పోటీలు  అనగా  షాట్ పుట్, జావలిన్ త్రో, రన్నింగ్,   చెస్, క్యారమ్స్,  వీల్ చైర్స్ మొదలైన  ఆటల పోటీలు నిర్వహించనున్నట్లు తెలిపారు . ఈ పోటీల్లో ప్రథమ , ద్వితీయ స్థానాల్లో గెలుపొందినవారు  రాష్ట్రస్థాయిలో నిర్వహించే ఆటల పోటీలకు వెళ్లాల్సి ఉంటుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో  డిఆర్డిఏ అడిషనల్ పీడీ నర్సింలు , చైల్డ్ డెవలప్మెంట్ ఆఫీసర్ వెంకటేశ్వరమ్మ,, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ చెందిన  పీఈటీలు, డివైఎస్ఓ  స్టాప్ రవి , వికారాబాద్ జిల్లాకు చెందిన  దివ్యాంగులు మరియు ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.