సిఎం కేసిఆర్ ఎక్కడికెళితే అక్కడ నిధుల వరద * ఒక్క రూపాయి హామీ ఇవ్వని సిఎం కేసీఆర్ * స్వీయ టిఆర్

Published: Thursday August 18, 2022

వికారాబాద్ బ్యూరో 17 ఆగస్టు ప్రజా పాలన.: సీఎం సార్ వస్తున్నారంటే నిధుల వరద పారుతుందని గంపెడాశతో ప్రజలు ఉంటారని మాజీ మంత్రి గడ్డం ప్రసాద్ కుమార్ అన్నారు. కానీ మంగళవారం వికారాబాద్ జిల్లా కేంద్రానికి వచ్చిన సీఎం కేసీఆర్ ఒక్క రూపాయి హామీ కూడా ఇవ్వలేదని విమర్శించారు. బుధవారం జిల్లా కేంద్రంలోని మాజీ మంత్రి స్వగృహంలో పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు అర్థ సుధాకర్ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సార్ వస్తారొస్తారని కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూసిన వారందరికీ నిరాశే మిగిల్చాడని దెప్పిపొడిచారు. సీఎం సమావేశానికి లక్ష మంది జనాన్ని తరలిస్తామని బీరాలు పలికిన వారందరు బేజారయ్యారన్నారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు సంబంధించి ప్రధాని నరేంద్ర మోడీకి ఎలాంటి సంబంధం లేదన్నారు. సీఎం కేసీఆరే పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు పెద్ద ఆటంకిగా మారాడని విమర్శించారు. సీఎం మోడీతో విభేదాలు ఉంటే ప్రధాని పగడితో సీఎం టోపీతో వచ్చి తేల్చుకోవాలని హితవుపలికారు. ఆర్ అండ్ బి పంచాయతీ రోడ్లన్నీ అద్దంలో చేస్తారని వికారాబాద్ ప్రజలు ఎదురు చూశారని స్పష్టం చేశారు. సీఎం కేసీఆర్ ముఖంలో చురుకుదనం లోపించి చావు కళ కొట్టొచ్చినట్టుగా కనబడిందని తెలిపారు. రాబోవు రోజుల్లో వచ్చే ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీ మనుగడ కోల్పోతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. స్థానిక నాయకులు ప్రజా సంఘాలు విద్యాసంఘాలు వ్యాపార సంఘాలు పోరాడితేనే వికారాబాద్ జిల్లా ఏర్పడిందని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం భూసేకరణ చేస్తే రోడ్ల నిర్మాణం త్వరగా జరుగుతాయని స్పష్టం చేశారు. వికారాబాద్ ప్రాంతం అభివృద్ధి గురించి సీఎం మాట్లాడకుండా భారతీయ జనతా పార్టీని మాటిమాటికి గుర్తు చేయడం వెన్నులో వణుకు పుట్టినట్లుందని విమర్శించారు. ఈ సమావేశంలో జిల్లా కిసాన్ సెల్ అధ్యక్షుడు రత్నారెడ్డి మున్సిపల్ మాజీ చైర్మన్ సత్యనారాయణ పిఎసిఎస్ మాజీ చైర్మన్ కిషన్ నాయక్ పెండ్యాల అనంతయ్య జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు సతీష్ రెడ్డి జొన్నల రవిశంకర్ కొత్తగడి కృష్ణారెడ్డి ప్రశాంత్ గౌడ్ దుద్యాల లక్ష్మణ్ ముదిరాజ్ ఎర్రవల్లి జాఫర్ చామల రఘుపతి రెడ్డి చాపల శ్రీనివాస్ ముదిరాజ్ నవీన్ అహ్మద్ ఖాన్ నర్సింలు తదితరులు పాల్గొన్నారు.