పేదల బ్రతుకుల్లో వెలుగులు నింపిన నేత గులాం రసూల్ --పల్లె శేఖర్ రెడ్డి

Published: Tuesday November 22, 2022
చౌటుప్పల్ నవంబర్ 21 (ప్రజాపాలన ప్రతినిధి)
మునుగోడు నియోజకవర్గంలో ఫ్లోరైడ్ రక్కసిని రూపుమాపడానికి అనేకసార్లు పాదయాత్ర చేసి కృష్ణా జలాలు అందేలా కృషి చేసి పేదల బతుకులను మార్చిన నేత గులాం రసూల్ అని సీపీఐ చౌటుప్పల్ మండల కార్యదర్శి పల్లె శేఖర్ రెడ్డి అన్నారు.గులాం రసూల్ 7వ వర్ధంతి సందర్భంగా చౌటుప్పల్ మున్సిపల్ కేంద్రంలోని సిపిఐ పార్టీ కార్యాలయంలో రసూల్ చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా పల్లె శేఖర్ రెడ్డి మాట్లాడుతూ పేద ప్రజల కోసం నిరంతరం పోరాడుతూ వారి జీవితాలలో వెలుగులు నింపిన మహానేత అని కొనియాడారు. రాచకొండ ఫీల్డ్ ఫైరింగ్ రేంజ్ కు వ్యతిరేకంగా గిరిజనులను ఏకం చేసి అనేక ఉద్యమాలు నిర్మించి చివరకు ఫీల్డ్ ఫైరింగ్ రేంజ్ నిర్ణయాన్ని ప్రభుత్వం ఉపసంహరించుకునేంతవరకు పోరాడిన గొప్ప నేత అని అన్నారు. ధర్మ బిక్షం స్ఫూర్తితో ఎర్రజెండాను చేతబట్టి అనేక గ్రామాల్లో విద్యార్థి, యువకులను చైతన్యం చేసి పోరాటం మార్గంలో నడిపే వారని అన్నారు.బడుగు బలహీన వర్గాల ప్రజలకు ఇండ్ల స్థలాలు,పేదలకు భూమికోసం అనేక పోరాటాలు చేసి వారి జీవితాల్లో వెలుగులు నింపారని తెలిపారు.నేటి తరం యువకులు గులాం రసూల్ పోరాట స్ఫూర్తిని ఆదర్శంగా తీసుకోవాలని అన్నారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ కార్యదర్శి పగిళ్ళ మోహన్ రెడ్డి, కొండూరి వెంకటేష్, ఉడుత రామలింగం, టంగుటూరి రాములు, బద్దుల సుధాకర్, దాసరి యాదయ్య తదితరులు పాల్గొన్నారు.