అమ్మపాలు అమృతంతో సమానం

Published: Thursday August 05, 2021

వలిగొండ ప్రజాపాలన ప్రతినిధి అమ్మపాలు అమృతంతో సమానం,శిశువుకు సంపూర్ణ ఆహారమని వేములకొండ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆరోగ్య పర్యవేక్షకుడు నాశబోయిన నరసింహ అన్నారు.బుధవారం వెల్వర్తి ఆరోగ్య ఉప కేంద్రంలో ఘనంగా తల్లిపాల వారోత్సవాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన తల్లులకు తల్లి పాల ప్రాముఖ్యత గురించి వివరించారు. తల్లిపాలు కల్తీ లేనివి, ఖరీదు కట్టలేనివనీ, ఏ కాలమైనా, ఏ రుతువైనా, ఎప్పుడైనా అనుక్షణం బిడ్డకు అందుబాటులో ఉంటాయన్నారు. తల్లిపాలు బిడ్డకు సులభంగా జీర్ణమయ్యే విలువైన పోషకాల గనిగా, శిశువు పుట్టిన గంటలోపే ముర్రిపాలు తప్పక పట్టించాలన్నారు. ఆరు నెలల వరకు కేవలం తల్లిపాలు తప్ప ఏ ఇతర పదార్థాలు ఇవ్వకూడదన్నారు. తల్లిపాలు బిడ్డకు మొదటి వ్యాధి నిరోధక టీకా లాగా పనిచేస్తుంద న్నారు. సీసా పాలు తాగే పిల్లల కన్నా తల్లిపాలు తాగే పిల్లలు బలంగా ఉంటారన్నారు. తల్లిపాలలో మాంసకృత్తులు, ఏ,బి, కె.విటమిన్లు ఉంటాయన్నారు. పాలిచ్చే తల్లులకు రొమ్ము మరియు గర్భాశయ క్యాన్సర్లు రావన్నారు. ఆరునెలల వరకు కేవలం తల్లిపాలు తాగించాలని, ఆ తర్వాత అనుబంధ పోషకాహారం ఇవ్వాలన్నారు. ఈ కార్యక్రమంలో సి.ఎచ్.ఒ. మురళీధర్, ఎచ్.ఇ.ఒ.గణేష్, హెల్త్ అసిస్టెంట్లు ఎం.జానకి రాములు, ఎ. సాలమ్మ, ఆశా కార్యకర్తలు లక్ష్మి, నరసమ్మ, నమ్రత, లక్ష్మి, గర్భిణిలు, బాలింతలు పాల్గొన్నారు.