కెరెల్లి గ్రామాభివృద్ధి పనులను కాపాడుకోవడం మన బాధ్యత

Published: Friday February 03, 2023
* కెరెల్లి గ్రామ సర్పంచ్ కొత్తపల్లి నర్సింహారెడ్డి
వికారాబాద్ బ్యూరో 2 ఫిబ్రవరి ప్రజాపాలన : 
కేరెల్లి, కొండాపురం, బాచారం గ్రామాలలో చేసిన అభివృద్ధి పనులను కంటికి రెప్పలా కాపాడుకోవడం మన అందరి బాధ్యత అని కెరెల్లి గ్రామ సర్పంచ్ కొత్తపల్లి నర్సింహారెడ్డి అన్నారు. గురువారం ధారూరు మండల పరిధిలోని కెరెల్లి గ్రామ పంచాయతీలో విలేఖరులతో మాట్లాడుతూ కెరెల్లి గ్రామ ప్రజలందరూ కలిసి కేరెల్లి గ్రామ పంచాయతీ సర్పంచ్ బాధ్యతలు అప్పగించారని గుర్తు చేశారు. దీనికి  మరొక్కసారి అందరికి ధన్యవాదాలు తెలిపారు. ప్రజలు అప్పగించిన మూడు గ్రామాల అభివృద్ధి బాధ్యతను గ్రామ సర్పంచుగా శక్తి కొలది నెరవేర్చానని విశ్వాసం వ్యక్తం చేశారు. మూడు గ్రామాలలో పాఠశాలలను బాగుచేయడం, పొలాలకు వెళ్లే రోడ్లు బాగుచేయడం, కల్వర్ట్స్ నిర్మించడం,  అవసరమైన చోట మంచినీటి సరఫరా, డ్రైనేజీ, సీసీ రోడ్స్, బాచారం, కొండాపురం గ్రామాలలో కమ్యూనిటీ హాల్స్ కట్టడం మొదలగు ముఖ్యమైన పనులు చేయవలసి వున్నదని స్పష్టం చేశారు. నిధుల లభ్యతను బట్టి వీటిని పూర్తి చేయడానికి శాయశక్తులా ప్రయత్నిస్తానని స్పష్టం చేశారు. గత నాలుగు సంవత్సరాలలో  మూడు గ్రామాల అభివృద్ధికి ప్రతి ఒక్కరు సహాయ సహకారాలు అందించడం అభినందనీయమని చెప్పారు. ప్రజలందరికి పేరు పేరున ధన్యవాదాలు తెలిపారు. ఇక ముందు కూడా ప్రజల సహాయ సహకారాలను అందించి కెరెల్లి, కొండాపురం, బాచారం గ్రామాల అభివృద్ధికి తోడ్పడాలని మనవి చేశారు. గత నాలుగు సంవత్సరాలలో ఎవరినైనా సర్పంచుగా ఇబ్బందికి గురి చేస్తే,  అది గ్రామాభివృద్ధి కొరకు మాత్రమేనని భావించాలని కోరారు. అందుకు క్షమించాలని అన్నారు. గ్రామాలను అభివృద్ధి చేయడం ఒక ఎత్తు అయితే అభివృద్ధి జరిగిన పనులను కాపాడుకొనడం మరో ఎత్తుగా భావించాలని తెలిపారు. భావి తరాలను గుర్తుంచుకొని జరిగిన అభివృద్ధిని కాపాడాలని మరొక్కసారి విజ్ఞప్తి చేశారు.
కెరెల్లి, కొండాపురం, బాచారం ప్రజలు సలహాలు సూచనలు గ్రామభివృద్ధికి ఎంతో ఉపయోగపడుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు.