అధికారులు ముద్దు నిద్ర వీడి కుక్కల బారి నుండి ప్రజలను కాపాడండి కుక్కల స్వైర విహారంతో మండల ప

Published: Thursday March 02, 2023
బోనకల్, మార్చి 1 ప్రజా పాలన ప్రతినిధి: వీధుల్లో కుక్కలు కనిపిస్తే చాలు స్థానికులు భయాందోళనలకు గురవుతున్నారు. రోడ్డు వెంబడి నడవాలంటేనే జంకుతున్నారు. వీధి కుక్కల స్వైర విహారంతో ప్రజల్లో ఆందోళన నెలకున్నా.. వాటిని నియంత్రించడంలో అధికారులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తున్నారు. అధికారులు మొద్దు నిద్ర వీడి కుక్కల బారి నుండి ప్రజలను కాపాడాలని గ్రామ ప్రజలు వేడుకుంటున్నారు. మండలంలో ఈ మధ్య కుక్కల దాడి ఘటనలు ఎక్కువగా జరుగుతున్నాయి. తాజాగా మండల కేంద్రంలో ఐదేళ్ల  చిన్నారి మంద జస్మిత పై కుక్క దాడి చేసి తల మీద గాయపరిచి కంటికి తన కాలివేలతో గీరడంతో కంటికి బలమైన గాయాలయ్యాయి. ఆ చిన్నారి కేకలు వేయడంతో గమనించిన తల్లిదండ్రులు వెంటనే ఖమ్మంలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ కు తరలించారు. వైద్యులు పరీక్షించి కంటికి బలమైన గాయం కావడంతో మెరుగైన వైద్యం కోసం హైదరాబాదులోని ఎల్వీ ప్రసాద్ హాస్పిటల్ కు పంపించారు. చిన్నారి కంటికి ప్రాథమిక శస్త్ర చికిత్స చేశారు. అయినా సరే ఆ చిన్నారి కంటి చూపును కోల్పోయింది. తల్లిదండ్రులు చూడకపోతే చిన్నారి ప్రాణానికి అపాయం వచ్చేదని స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు. అదేవిధంగా రావినూతల గ్రామంలో ఓ బాలుడిపై కుక్క దాడికి పాల్పడి ముఖం మీద బలమైన గాయాలు అయ్యాయి.ఇటీవల హైదరాబాద్లో కుక్కల దాడిలో చిన్నారి మృతి చెందిన సంఘటన మరువక ముందే మండల కేంద్రంలో చిన్నారిపై కుక్క దాడి చేయడంతో తల్లిదండ్రుల తో పాటు స్థానికులు భయందోళనకు గురవుతున్నారు.
 
కుక్కల నియంత్రణలో అధికారులు శూన్యం....
 
 
వీధి కుక్కలను నియంత్రించాల్సిన అధికారులు  చర్యలు తీసుకున్నా దాఖాలాలులేవు. చిన్నపిల్లలపై కుక్కలు దాడి చేస్తున్న సరే  వాటి నియంత్రణ కోసం అధికారుల చర్యలు మాత్రం శూన్యం.ఈ కుక్కల బెడద అన్ని గ్రామాల్లో ఉండడంతో చిన్నారులను ఒంటరిగా పాఠశాలలకు పంపేందుకు తల్లిదండ్రులు భయపడుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి,గ్రామాల్లో కుక్కల బెడద లేకుండా చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు