షర్మిల నిరుద్యోగ దీక్షను విజయవంతం చేయాలి

Published: Tuesday June 14, 2022

మధిర  చింతకాని జూన్ 13 ప్రజా పాలన ప్రతినిధి  తెలంగాణ రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేయాలని డిమాండ్ చేస్తూ వైయస్సార్ తెలంగాణ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మంగళవారం చింతకాని మండలం పాతర్ల పాడు గ్రామంలో చేపట్టిన నిరుద్యోగ దీక్షను విజయవంతం చేయాలని వైయస్సార్ తెలంగాణ పార్టీ దళిత విభాగం ఖమ్మం జిల్లా అధ్యక్షులు రిటైర్డ్ సీఐ మద్దెల ప్రసాదరావు చింతకాని మండల అధ్యక్షులు వాక వీరారెడ్డి కోరారు. సోమవారం మధిర నియోజకవర్గం పరిధిలోని మధిర చింతకాని మండలాల్లో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధినాయకురాలు వైఎస్ షర్మిల ఆదేశాల మేరకు ఇంటింటికి వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మద్దెల ప్రసాదరావు వాక వీరారెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో రెండు లక్షల పైచిలుకు ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని వాటిని  భర్తీ చేయాలని ప్రతి మంగళవారం వైయస్ షర్మిల నిరుద్యోగ దీక్ష చేపడుతున్నారని వారు తెలిపారు. ఈ మంగళవారం చింతకాని మండలం పాతర్ల పాడులో వైఎస్ షర్మిల నిరుద్యోగ దీక్ష చేస్తున్నారని, ఈ దీక్షలో నిరుద్యోగులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని వారు కోరారు. రాష్ట్రంలో సంక్షేమం కావాలంటే షర్మిలమ్మ రావాలి అనే నినాదంతో ఇంటింటికి వైఎస్సార్ తెలంగాణ పార్టీ అనే కార్యక్రమాన్ని మధిర నియోజకవర్గంలో గ్రామగ్రామాన చేపడుతున్నట్లు వారు తెలిపారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్రెడ్డి హయాంలో రైతులకు ఒకే సారి రుణమాఫీ చేశారని, పత్తి విత్తనాల ధరలను తగ్గించారని ఫీజు రియంబర్స్మెంట్, 108, 104, ఉచిత విద్యుత్, ప్రాజెక్టుల నిర్మాణం అర్హులైన వారికి పెన్షన్లు ఇవ్వటం లాంటి అనేక సంక్షేమ పథకాలు అమలు చేశారన్నారు. అంతేకాకుండా నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించారని, మైనార్టీలకు రిజర్వేషన్లు అందించారని వారు గుర్తు చేశారు. ప్రస్తుత టిఆర్ఎస్ పాలనలో నిరుద్యోగ భృతి లేదని, ఎనిమిదేళ్లుగా కొత్త పెన్షన్లు ఇవ్వటం లేదని, రుణమాఫీ లేదని, ఇల్లు, ఇళ్ల స్థలాలు ఇవ్వడంలేదని వారు ఆరోపించారు. తెలంగాణ రాష్ట్రంలో సంక్షేమ రాజ్యం కావాలంటే షర్మిలమ్మ రావాలని నినాదాన్ని గ్రామ గ్రామాన మారుమ్రోగే విధంగా నాయకులు కార్యకర్తలు కష్టపడి పనిచేసి ఇంటింటికి వైఎస్సార్ తెలంగాణ పార్టీ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని వారు కోరారు. మధిర నియోజకవర్గంలో కొనసాగుతున్న షర్మిల పాదయాత్రకు ప్రజలు భారీ సంఖ్యలో హాజరై మద్దతు ప్రకటించడంపట్ల వారు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్ తెలంగాణ పార్టీ ముదిగొండ మండల అధ్యక్షులు సామినేని రవి నాయకులు దమ్మాలపాటి గోవర్ధన్ రావు సామినేని శ్రీనివాసరావు వల్లంకొండ మల్లయ్య తదితరులు పాల్గొన్నారు.