సబ్బండ వర్గాల ఆత్మ గౌరవ ప్రతీక చాకలి ఐలమ్మ : జిల్లా అదనపు కలెక్టర్ మోతిలాల్

Published: Monday September 27, 2021
వికారాబాద్ బ్యూరో 26 సెప్టెంబర్ ప్రజాపాలన : తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు, సబ్బండ వర్గాల ఆత్మ గౌరవ ప్రతీక చాకలి ఐలమ్మ అని జిల్లా అదనపు కలెక్టర్ మోతిలాల్ కొనియాడారు. ఆదివారం వికారాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ అధికారి అన్నపరెడ్డి పుష్పలత ఆధ్వర్యంలో వీరనారి చాకలి ఐలమ్మ 126వ జయంతి ఉత్సవాలను అధికారికంగా జిల్లా అదనపు కలెక్టర్ మోతిలాల్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్బంగా వికారాబాద్ పట్టణ ప్రముఖులతో కలిసి ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా జిల్లా అదనపు కలెక్టర్ మోతిలాల్ మాట్లాడుతూ భూమి కోసం, భుక్తి కోసం, దోపిడీ,పీడన నుంచి విముక్తి కోసం జరిగిన ఆనాటి సాయుధ రైతాంగ పోరాటంలో దొరల గడీలను గడగడ లాడించిన వీరనారి చాకలి ఐలమ్మ అని, ఆమె ధైర్యసాహాసాలు, ఆశలు, ఆశయాలను స్పూర్తిగా తీసుకొని ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. సాయుధ రైతాంగ పోరాటం చేసిన తెలంగాణ వీర వనిత, జయంతి వేడుకలను రాష్ట్ర ప్రభుత్వం ఇక నుండి ప్రతి ఏటా రాష్ట్ర వేడుకగా అధికారికంగా నిర్వహించాలని నిర్ణయించిందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర బిసి కమిషన్ సభ్యులు శుభప్రద్ పటేల్, విద్య మౌలిక వసతుల కల్పనల సంస్థ చైర్మన్ నాగేందర్ గౌడ్, మున్సిపల్ చైర్మన్ మంజుల రమేష్, బిసి సంక్షేమ శాఖ అధికారిని పుష్పలత, డిటీడీఓ కోటాజి, జిల్లా రజక సంఘం అధ్యక్షుడు పెద్ద లాల్ రాములు వికారాబాద్ పట్టణ రజక సంఘం అధ్యక్షుడు అనంతయ్య జిల్లా రజక సంఘం మాజీ అధ్యక్షుడు సత్తయ్య, జిల్లా రజక సంఘం ఉపాధ్యక్షుడు గోవర్ధన్ రాజు తదితర నాయకులు అందరు ఈ సందర్బంగా వీరనారి చాకలి ఐలమ్మ జీవిత చరిత్ర, ఆమె చేసిన తెలంగాణ సాయుధ పోరాటాన్ని కొనియాడారు.