ఇబ్రహీంపట్నం డిసెంబర్ తేదీ 7ప్రజాపాలన ప్రతినిధి

Published: Thursday December 08, 2022

ఆడబిడ్డలపై అత్యాచారాలు, అఘాయిత్యాలు పేట్రేగడం- విచ్చలవిడి మద్యం అమ్మకాలు-గంజాయి, డ్రగ్స్ మాఫియా ఆగడాలు-చిన్నారులు, మహిళల్లో అభద్రతా భావం-శాంతిభద్రతలు కాపాడేందుకు అత్యన్నత స్థాయి మానిటరింగ్ కమిటీ నియామకం గురించి:
ప్రత్యేక రాష్ట్రంలో ఆడబిడ్డలకు భద్రత, గౌరవ ప్రతిపత్తులు ఉంటాయనే ఆశలను నీరుగార్చారు. ప్రతిరోజూ ఏదోచోట అత్యాచారాలు, అఘాయిత్యాల వార్తలే. పాఠశాలకెళ్లిన చిన్నారి, ఉద్యోగానికి వెళ్లిన యువతి, మార్కెట్ కెళ్లిన మహిళ క్షేమంగా తిరిగొచ్చే పరిస్థితి లేకుండా పోయింది. విచ్చలవిడి మద్యం, గంజాయి అమ్మకాలు పేట్రేగిపోయాయి.. డ్రగ్స్, పబ్ సంస్కృతి ప్రబలిపోయింది.
జూబ్లీహిల్స్ వద్ద పబ్ నుంచి బాలికను తీసుకెళ్లి కారులో అఘాయిత్యం మరువకముందే, హయత్ నగర్ లో బాలిక గ్యాంగ్ రేప్ రాష్ట్రంలో ఆడబిడ్డల అభద్రతకు అద్దం పడుతోంది. పేపర్ చదివినా, న్యూస్ ఛానల్ చూసినా అత్యాచారాల వార్తలే.. 9నెలల పసికందు నుంచి 70 ఏళ్ల ముసలమ్మ వరకు ఎవరికీ భద్రత లేకుండా పోయింది.
రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులకు ఎన్ సిఆర్ బి నివేదిక అద్దం పట్టింది. లైంగిక అక్రమ రవాణా (హ్యూమన్ ట్రాఫికింగ్)లో తెలంగాణ తొలిస్థానంలో ఉండటం శోచనీయం. గత 8 ఏళ్లలో ఫోక్సో కేసులు 3 రెట్లు పెరిగాయి. దళిత మహిళలపై అత్యాచారాల్లో రాష్ట్రం 5వ స్థానం, గిరిజన మహిళలపై అత్యాచారాల్లో 6వ స్థానంలో ఉండటం సభ్య సమాజానికే తలవంపులు..
మహిళలపై నేరాలు గత 3 ఏళ్లలో 57 వేలకు పైగా, చిన్నారులపై దాడులు 14 వేలకు పైగా జరగడం ఆందోళనకరం. అత్యాచారాల కేసులు 823 నమోదైతే, అత్యాచార యత్నాల కేసులు 36 నమోదు కావడం ఆడబిడ్డల అభద్రతకు నిదర్శనం. డ్రగ్స్ కేసులు 1,346 నమోదయ్యాయని ఎన్ సి ఆర్సీ నివేదిక బైటపెట్టింది. ఈ లెక్కలోకి దాని దాడులు, దౌర్జన్యాలు, అత్యాచారాలు, అఘాయిత్యాలు మరెన్నో... మద్యం ఏరులై పారడం, గంజాయి అక్రమ రవాణా, వినియోగం, డ్రగ్స్ మాఫియా ఆగడాలు పెరిగిపోవడం ప్రభుత్వ వైఫల్యాలకు పరాకాష్ట
వీటన్నింటికి అడ్డుకట్ట వేసేలా ప్రభుత్వ యంత్రాంగాన్ని మేల్కొలపాలి. భవిష్యత్తులో మరే దుర్ఘటన జరగకుండా ఎక్కడిక్కడ కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలి. అరాచకాలకు పాల్పడే దుండగులకు కఠిన శిక్షలు పడేలా చేయాలి. శాంతిభద్రతల పరిరక్షణలో నిర్లక్ష్యం, ఉదాసీనతకు ఆస్కారం లేకుండా చేయాలి. సమాజంలో అశాంతి-అభద్రత తొలగించడంలో ఆధునిక సాంకేతికతను సద్వినియోగం చేసుకోవాలి. మరింత సమర్ధవంతంగా పోలీసింగ్ జరిగేలా చూడాలి. ప్రతిచోటా నిఘా ముమ్మరం చేయాలి. అన్ని ప్రాంతాల్లో సిసి కెమెరాలు ఏర్పాటు చేయాలి.. ఆడబిడ్డలపై వేధింపులు దౌర్జన్యాలు, అత్యాచారాలు- అఘాయిత్యాలకు అడ్డుకట్ట పడేలా రాష్ట్రంలో శాంతిభద్రతల పర్యవేక్షణుడు "అత్యున్నత స్థాయి మానిటరింగ్ కమిటీని నియమించాలని, సదరు కమిటీ శాఖలను ప్రతి జిల్లాలో ఏర్పాటు చేసి, సమర్థ పోలీసింగ్తో ఆడబిడ్డలకు భద్రతపై భరోసా కల్పించాలని మనవి చేస్తున్నారు, ఈ కార్యక్రమంలో  ఇబ్రహీంపట్నం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్చార్జ్ చక్రపాణి, స్వప్న, మల్లమ్మ, శ్యామల , తదితరులు పాల్గొన్నారు,