హరిదాసుపల్లిలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు

Published: Saturday April 15, 2023
* పిఎసిఎస్ డైరెక్టర్ రాఘవేందర్
వికారాబాద్ బ్యూరో 14 ఏప్రిల్ ప్రజా పాలన : డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం ప్రపంచ దేశాలకే దిక్సూచిగా మారిందని హరిదాసుపల్లి పిఎసిఎస్ డైరెక్టర్ రాఘవేందర్ అన్నారు. భారతదేశంలో విభిన్న ఆచార వ్యవహారాలతో జీవించే ప్రజల జీవనశైలిని కళ్ళకు కట్టినట్టుగా రాజ్యాంగంలో పొందుపరిచారని స్పష్టం చేశారు. శుక్రవారం ధారూర్ మండల పరిధిలోని హరిదాసు పల్లిలో నూతనంగా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహ ప్రతిష్టాపన చేసి అతని 132వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. బిఆర్ అంబేద్కర్ తాను బాల్యంలో అనుభవించిన కష్టాలు అవమానాలు అసమానతలను నేటి తరం చవిచూడరాదనే ఉద్దేశంతో రాజ్యాంగాన్ని రచించారని పేర్కొన్నారు. సాంఘిక దురాచారాలను రూపుమాపేందుకు రాజ్యాంగంలో పొందుపరిచిన పలు అంశాలు
అనుసరణీయమని గుర్తు చేశారు. భారత రాజ్యాంగం వలనే అణగారిన ప్రజలు సైతం రాజ్యాధికారంలో భాగస్వాములు కావడం విశేషమని కొనియాడారు. అన్ని సామాజిక వర్గాలకు సమ ప్రాధాన్యత కల్పించే విధంగా రాజ్యాంగాన్ని రచించడం అభినందనీయమని తెలిపారు. కష్టనష్టాలకు ఓర్చి అత్యున్నత విద్యావంతుడిగా వెలిగిన డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఆశయాలను వమ్ము చేయరాదని సూచించారు. గ్రామంలో రాజకీయాలను పక్కకు పెట్టి గ్రామ అభివృద్దే లక్ష్యంగా ప్రతి ఒక్కరు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పిఎసిఎస్ చైర్మన్ పోలీస్ వెంకట్ రెడ్డి, వైస్ చైర్మన్ కృష్ణ గ్రామ పెద్దలు గడ్డమీది లక్ష్మయ్య, సాయి రెడ్డి, వడ్ల లక్ష్మయ్య, స్వరాజ్ యువజన సంఘం అధ్యక్షుడు రాజు, యువకులు రాజు, శ్రీనివాస్, రాము, శ్రీశైలం, ప్రభాకర్, తదితరులు పాల్గొన్నారు.