సంక్షేమానికి మరో భూమిక రైతు వేదిక

Published: Tuesday July 06, 2021
- వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్
వికారాబాద్ జూలై 05 ప్రజాపాలన బ్యూరో : తెలంగాణలో ఉన్న రైతాంగాన్ని సంఘటితం చేసేందుకు రైతు వేదికలు ఉపయోగపడతాయని వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ అన్నారు. సోమవారం ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ వికారాబాద్ మండల పరిధిలోని మైలార్ దేవరంపల్లి, గొట్టి ముక్కల, సిద్దులూర్ గ్రామాలలో నిర్మించిన రైతు వేదిక భవనాలను సర్పంచులు ఆలంపల్లి తిరుపతి రెడ్డి, పట్లే వెంకటేశ్వర్లు ముదిరాజ్, బంటు ఆంజనేయులు ముదిరాజ్ లతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రానున్న రోజుల్లో రైతులకు సంబంధించిన ప్రతి మీటింగ్ రైతు వేదిక నుండి జరుగుతుందన్నారు. రైతు వేదికలో మీటింగ్ కోసం కావాల్సిన కుర్చీలను, టేబుల్స్ ను ప్రభుత్వం అందించిందన్నారు. దేశంలో రైతుల కోసం ఇలాంటి నిర్మాణం ఎక్కడ కూడా జరగలేదన్నారు. కరోనా కష్టకాలంలో కూడా పెట్టుబడి సాయం అందించిన ముఖ్యమంత్రి కేసీఆర్ కు ధన్యవాదాలు తెలిపారు. నకిలీ విత్తనాల నుంచి రైతులు మోసపోకుండా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందన్నారు. రైతులు మేలైన వంగడాలు ఎంపిక చేసుకునేలా మరియు అధిక లాభాలు పొందే విధంగా వ్యవసాయాధికారులు కృషి చేయాలన్నారు. అనంతరం నాల్గవ విడత పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా పల్లె ప్రకృతి వనాన్ని సందర్శించి, రైతు వేదిక ఆవరణలో మొక్కలు నాటి నీరు పోశారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచులు ఎంపీపీ చంద్రకళ, శివారెడ్డి పేట్ పిఏసిఎస్ చైర్మన్ మాసనగారి ముత్యం రెడ్డి,  మండల పార్టీ అధ్యక్షుడు నారెగూడెం కమాల్ రెడ్డి, సర్పంచుల సంఘం అధ్యక్షుడు సామల పురుషోత్తం రెడ్డి, రైతు బంధు అధ్యక్షుడు వెంకటయ్య, డిఏఓ గోపాల్, ఏడిఏ వినోద్ కుమార్, ఎంఏఓ ప్రసన్న  లక్ష్మి, ఎంపిడిఓ సుభాషిణి, ఏఈఓలు పావని, ప్రతిభ, కావ్య, సర్పంచులు, ఉపసర్పంచులు, ఎంపీటీసీ లు, పార్టీ నాయకులు కార్యకర్తలు, అధికారులు పాల్గొన్నారు.