ఎఫ్ ఎసి హెడ్మాస్టర్ల సమస్యలు పరిష్కరించాలి

Published: Monday November 29, 2021

జగిత్యాల, నవంబర్ 28 (ప్రజాపాలన ప్రతినిధి) : పాఠశాల నిర్వహణ పూర్తి అదనపు బాధ్యతలు నిర్వర్తిస్తున్న ఎఫ్ ఎసి హెడ్మాస్టర్ల సమస్యలు వెంటనే పరిష్కరించాలి అని రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం ఎస్ టియుటిఎస్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు బైరం హరి కిరణ్, మచ్చ శంకర్ ప్రభుత్వాన్ని కోరారు. ఆదివారం ఎస్ టియు భవన్ లో జరిగిన సమావేశంలో వారు మాట్లాడుతూ జిల్లాలో 176 పిజిహెచ్ఎం పోస్టులకు గాను 99 మంది సీనియర్ స్కూల్ అసిస్టెంట్ టీచర్ లు ఎఫ్ఎసి  హెచ్ఎం గా అదనపు బాధ్యతలు నిర్వర్తించటం వల్ల విద్యార్థులు సబ్జెక్ట్ కి దూరం అవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అటు సబ్జెక్ట్ బోధన, ఇటు గంటకో రిపోర్ట్ లు పంపడం, ఎండిఎం నిర్వహణకు బాధ్యులను చేయడం, పాఠశాల నిర్వహణ అదనపు బాధ్యతల వల్ల తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తోందని అన్నారు. చాలా చోట్ల సీనియర్ స్కూల్ అసిస్టెంట్ లు గెజిటెడ్ కాకున్నా స్కూల్ కాంప్లెక్స్  హెచ్ఎం గా కూడా అదనపు బాధ్యతలు నిర్వర్తించడం వల్ల జీతభత్యాల చెల్లింపులు, సర్వీసు మ్యాటర్ లు, వారి పరిధిలోని పాఠశాలల పర్యవేక్షణ బాధ్యతలతో తీవ్ర మానసిక పని వొత్తిడికి గురవుతున్నారన్నారు. ఎఫ్ఎసి లు ఉన్నచోట వెంటనే సబ్జెక్ట్ విద్యావాలంటీర్ను, ఒక కంప్యూటర్ ఆపరేటర్ ని నియమించాలన్నారు. ఎఫ్ఎసి అలవెన్స్ కింద  హెచ్ఎం లకు నెల నెలా 5 వేల రూపాయలు  మంజూరు చేయాలని కోరారు. స్వచ్ఛ కార్మికులు స్కావేంజర్  లేకపోవడంతో కొన్ని చోట్ల  హెచ్ఎం లు జేబులోంచి జీతం ఇచ్చి స్థానికంగా ఒకరిని నియమించుకొని పాఠశాల నిర్వహణ చేయాల్సి వస్తోందని వాపోయారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి మచ్చ శంకర్, జిల్లా ఆర్థిక కార్యదర్శి మేకల ప్రవీణ్, వెంకటేష్,  సలీం,  కృష్ణ, రాజేశ్వర్, విష్ణు, లక్ష్మారెడ్డి, మురళీ తదితరులు పాల్గొన్నారు..