పట్టణ ప్రగతితో అభివృద్ధి సాధ్యం

Published: Saturday June 04, 2022
మేడిపల్లి, జూన్ 3 (ప్రజాపాలన ప్రతినిధి)
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన పట్టణ ప్రగతి కార్యక్రమంలో కాలనీలలో నెలకొన్న సమస్యలను గుర్తించి వాటి పరిష్కారానికి సాధ్యమవుతుందని పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ కుర్ర శివ కుమార్ గౌడ్ పేర్కొన్నారు. కార్పొరేషన్ పరిధిలోని 26వ డివిజన్ కార్పొరేటర్ పప్పుల రాజేశ్వరి అంజిరెడ్డి ఆధ్వర్యంలో పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని డివిజన్లోని బండి సత్తయ్య కమ్యూనిటీ హాల్ శంకర్ నగర్లో డిప్యూటీ మేయర్ శివ కుమార్ గౌడ్,       కమిషనర్ రామకృష్ణ రావు, డిఈ,ఏఈ లు ప్రారంభించారు. ఈ సందర్బంగా డిప్యూటీ మేయర్ మాట్లాడుతూ పట్టణ ప్రగతి కార్యక్రమం ద్వారా అనేక సమస్యలు తీరుతాయని, ప్రజలు కూడ పరిసరాలను పరిశ్రుభంగా ఉంచుకోవాలని సూచించారు.
కార్పొరేటర్ రాజేశ్వరి అంజి రెడ్డి మాట్లాడుతూ ప‌చ్చదనం,పరిశుభ్రతను మరింత పెంపొందించాల‌నే ఉద్దేశ్యంతో ప్రభుత్వం చేపట్టిన పట్టణ ప్రగతి కార్యక్రమం ద్వారా మంచి ఫలితాలు వస్తున్నాయని అన్నారు. భవిష్యత్ తరాలకు కాలుష్య రహిత సమాజాన్ని అందించాలనే లక్ష్యంతో సీఎం కేసీఆర్  తలపెట్టిన పట్టణ ప్రగతిలో ప్రజలు సహకారం అందించి విరివిగా మొక్కలు నాటాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో డిఈ శ్రీనివాస్,ఏఈ వినీల్, జలమండలి మేనేజర్ రమ్య ప్రియ,శానిటేషన్ ఇన్స్పెక్టర్ జగన్ మోహన్, ఆర్ వో శ్రీనివాస్,  కాలనీ పెద్దలు,మహిళలు తదితరులు పాల్గొన్నారు.