పనులను పూర్తి చేసి ప్రారంభానికి సిద్దం చేయాలి ప్రభుత్వ విప్, చెన్నూర్ శాసనసభ్యులు బాల్క సుమ

Published: Friday December 09, 2022

ప్రభుత్వ సేవలన్నీ ఒకే చోట అందించాలనే ఉద్దేశ్యంతో ప్రభుత్వం చేపట్టిన సమీకృత కలెక్టరేట్ భవన సముదాయాల నిర్మాణాలలో భాగంగా జిల్లా చేపట్టిన నిర్మాణ పనులను ఫిబ్రవరి మాసంలోగా పూర్తి చేసి ప్రారంభించేందుకు సిద్దం చేయాలని ప్రభుత్వ విప్, చెన్నూర్ నియోజకవర్గ శాసనసభ్యులు బాల్క సుమన్ అన్నారు. గురువారం జిల్లా కలెక్టర్ భారతి హోళికేరి, ట్రైనీ కలెక్టర్ గౌతమి, శాసన మండలి సభ్యులు దండే విఠల్తో కలిసి నస్పూర్ నిర్మితమవుతున్న సమీకృత కలెక్టరేట్ ఆడిటోరియం, వివిధ శాఖలకు కేటాయించనున్న గదులు, కలెక్టర్ చాంబర్, సమావేశ మందిరం ఇతర విభాగాల పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేసి ప్రారంభానికి సిద్ధం చేయాలని గుత్తేదారులను ఆదేశించారు. కలెక్టరేట్కు చేరుకునే అంతర్గత రహదారులు, విద్యుత్, నీరు ఇతరత్రా సౌకర్యాల కల్పనలో ఎలాంటి లోటుపాట్లు లేకుండా సంబంధిత అధికారులు గుత్తేదారుల సమన్వయంతో పనులు పూర్తి చేయాలని తెలిపారు. అన్ని ప్రభుత్వ కార్యాలయాలు ఒకే కేంద్రంగా ఏర్పాటు చేసి ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ప్రభుత్వ సేవలు ఒకే చోట అందించాలనే ఉద్దేశ్యంతో ప్రభుత్వం సమీకృత కలెక్టరేట్ల నిర్మాణాలు చేపట్టడం జరిగిందని, పనులు పూర్తయిన వెంటనే రాష్ట్ర ముఖ్యమంత్రి చేతుల మీదుగా ప్రారంభిస్తామని తెలిపారు. నూతన సమీకృత కలెక్టరేట్ ప్రజలకు అందించే ప్రభుత్వ సేవలన్నీ ఒకే చోట లభించడంతో వ్యయప్రయాసల ఇబ్బందులు ఉండవని, ప్రజల సౌకర్యార్థం ప్రభుత్వం అన్ని విధాల అండగా ఉంటూ అవసరమైన చర్యలు చేపడుతుందని తెలిపారు.  ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ప్రవీణ్ కుమార్, నస్పూర్ మండల తహశిల్దార్ జ్యోతి, మున్సిపల్ కమీషనర్ రమేష్, మున్సిపల్ వైస్చర్మన్ శ్రీనివాస్, వార్డు కౌన్సిలర్ వంగ తిరుపతి, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.