ట్రాన్స్ జెండర్ల సంక్షేమం కొరకు ఉపాధి పునరావాస పథకం ** జిల్లా కలెక్టర్ బొర్కడే హేమంత్ సహదేవ్

Published: Wednesday February 15, 2023

ఆసిఫాబాద్ జిల్లా ఫిబ్రవరి 14 (ప్రజాపాలన ప్రతినిధి) :జిల్లాలోని అర్హులైన ట్రాన్స్ జెండర్లు ఆర్థికంగా అభివృద్ధి చెందేందుకు స్వయం ఉపాధి క్రింద యూనిట్ల మంజూరు కొరకు ప్రభుత్వం వికలాంగులు, వయోవృద్ధులు, ట్రాన్స్ జెండర్ల సంక్షేమ శాఖ ద్వారా ఉపాధి పునరావాస పథకం నిర్వహించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ బొర్కడే హేమంత్ సహదేవ్ రావు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇందు కొరకు అర్హులైన ట్రాన్స్ జెండర్లు ఈ నెల 23వ తేదీ లోగా దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. వ్యవసాయం, అనుబంధ పరిశ్రమలు,సేవా వ్యాపారాలను స్థాపించుకొని తద్వారా స్థిరమైన ఆదాయాన్ని పొంది సాధారణ జీవనాన్ని గడపాలనే ఉద్దేశ్యంతో ప్రభుత్వం అవకాశం కల్పించడం జరిగిందని తెలిపారు. ఈ పథకం ద్వారా జిల్లాకు 2 యూనిట్ల ద్వారా రూ 1 లక్ష మంజూరు చేయడం జరిగిందని, దరఖాస్తు చేసుకునే ట్రాన్స్ జెండర్లు సంబంధిత జిల్లా కలెక్టర్ జారీ చేసిన గుర్తింపు కార్డు, కాంపిటెంట్ అథారిటీ జారీ చేసిన ట్రాన్స్ జెండర్ సర్టిఫికెట్ తప్పనిసరిగా కలిగి నేషనల్ పోర్టల్ లో రిజిస్టర్ అయి ఉండాలని అన్నారు. ఆసక్తి గల అభ్యర్థులు తమ దరఖాస్తులను ఈ నెల 23 లోగా జిల్లా సంక్షేమ అధికారి కార్యాలయంలో సమర్పించాలని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు