జిల్లా కలెక్టర్ చొరవ ఆదర్శనీయం మంచిర్యాల బ్యూరో, వంబర్ 2, ప్రజాపాలన:

Published: Friday November 04, 2022

ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగులకు ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల చేస్తున్న నేపథ్యంలో పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతున్న యువతకు ప్రభుత్వ పరంగా ప్రత్యేక శిక్షణ తరగతులు నిర్వహించాలని తలపెట్టిన తరుణంలో మంచిర్యాల జిల్లా కలెక్టర్ భారతి హోళ్ళికేరి యువతీ, యువకులకు శిక్షణ అందించడం కోసం జిల్లాలో చేపట్టిన ప్రత్యేక కార్యక్రమాలు ఆదర్శంగా నిలిచాయి. జిల్లాలోని గుడిపేటలోని 13వ ప్రత్యేక తెలంగాణ పోలీసు పటాలములో ఎన్.ఐ., కానిస్టేబుళ్ళ పోస్టుల కొరకు శిక్షణ తీసుకుంటున్న యువతీ, యువకులకు కావలసిన పుస్తకాలు, దుస్తులు, బూట్లతో పాటు అవసరమైన మెటీరియల్ను తన స్వంత ఖర్చులతో కొనుగోలు అందించడం అభినందనీయం. తాను స్వయంగా ఐ.పి.ఎన్. శిక్షణ పొందిన జిల్లా కలెక్టర్ శిక్షణ పొందుతున్న యువతీ, యువకులకు వివిధ బోధనా అంశాలు, సామాజిక అంశాలపై స్వయంగా ప్రత్యేక తరగతులు నిర్వహించి, పట్టుదల, కృషి, పోటీతత్వంతో కష్టపడి ఉద్యోగం సాధించి తల్లిదండ్రులు, గురువులు గర్వించే విధంగా నిలవాలని ప్రోత్సహించారు. 13వ పోలీసు పటాలములో 850 మంది నిరుద్యోగ యువత శిక్షణ దరఖాస్తు చేసుకొని 3 నెలల పాటు బెటాలియన్ కమాండెంట్ రామకృష్ణ పర్యవేక్షణలో ఎన్.ఐ. ఉద్యోగానికి 205 మంది, కానిస్టేబుల్ ఉద్యోగానికి 553 మంది అభ్యర్థులు ప్రిలిమినరీ పరీక్షలలో అర్హత సాధించగా 700 మంది అభ్యర్థులు ఫిజికల్ ఈవెంట్స్లో పటాలము మైదానంలో శిక్షకుల ఆధ్వర్యంలో శిక్షణ పొందుతున్నారు. అంతే కాకుండా జిల్లాలోని 3 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలోని గ్రంథాలయాలలో శిక్షణ తగరతులు ఏర్పాటు చేసి గ్రామీణ ప్రాంతాలకు చెందిన యువతను ప్రభుత్వ ఉద్యోగాలు సాధించే విధంగా ప్రోత్సహిస్తూ శిక్షణ అందించారు.