స్వీకరించిన దరఖాస్తులను వారం రోజుల్లో పరిష్కరించాలి

Published: Tuesday February 07, 2023
* వికారాబాద్ జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి
వికారాబాద్ బ్యూరో 06 ఫిబ్రవరి ప్రజాపాలన : ప్రజల సమస్యల పరిష్కారం కోసం నిర్వహిస్తున్న ప్రజావాణి కార్యక్రమంలో స్వీకరించిన దరఖాస్తులను వారం రోజులలో పరిష్కరించే దిశగా అధికారులు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి ఆదేశించారు. సోమవారం కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా జిల్లా కలెక్టర్ ముందుగా అధికారులతో మాట్లాడుతూ, ప్రతి సోమవారం నిర్వహించే  ప్రజావాణి కార్యక్రమంలో తాను వంద శాతం అందుబాటులో ఉంటానని,  ఉదయం 10:30 గంటల నుండి  మధ్యాహ్నం 2:00 గంటల వరకు అధికారులందరూ కూడా సమయపాలన పాటించి సకాలంలో ప్రజావాణికి హాజరుకావాలని ఆదేశించారు. ప్రజావాణికి వచ్చే ఫిర్యాదుదారులతో మమేకమై వారి సమస్యలను క్షుణ్ణంగా పరిశీలించి పరిష్కార దిశగా కృషి చేయాలని, నిర్లక్ష్యం వహించరాదని సూచించారు.  పరిష్కరించుటకు వీలులేని పక్షంలో తదుపరి చర్యల కోసం వారికి అర్థమయ్యే విధంగా సూచనలు అందించాలన్నారు.   కలెక్టర్ గా అధికారులలందరికి ఎల్లవేళలా అందుబాటులో ఉంటానని, అధికారులు కూడా అందుబాటులో ఉండి ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని సూచించారు.  ప్రజలు ప్రజా ప్రతినిధుల సహకారంతో జవాబుదారితనం, పారదర్శకతతో పని దినాలలో పనిచేయాలని, వారంలో ఐదు రోజులపాటు క్షేత్రస్థాయిలో పర్యటించి పనులలో పురోగతి సాధించాలని తెలిపారు.  తమ ఆధీనంలోని క్రింది స్థాయి సిబ్బందితో కూడా అధికారులు మంచి సేవలు రాబట్టాలని, నిర్లక్ష్యం వహించే సిబ్బందిపై చర్యలు చేపట్టాలని సూచించారు.  రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలను అధికారులందరూ టీం వర్క్ గా పనిచేసి రాష్ట్రంలో జిల్లాను టాప్ - 5 లో నిలపాలని  అన్నారు.  రాబోవు రెండు మూడు రోజులలో కలెక్టర్ కార్యాలయంలో బయోమెట్రిక్, సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు.  బయోమెట్రిక్ ఆధారంగానే ట్రెజరీల ద్వారా ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు అందించడం జరుగుతుందని తెలిపారు. ఈరోజు ప్రజావాణి కార్యక్రమంలో వివిధ సమస్యలపై 142 దరఖాస్తులను కలెక్టర్ స్వీకరించారు.  వచ్చిన దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలని సంబంధిత శాఖల అధికారులను కలెక్టర్ ఆదేశించారు.

ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ (లోకల్ బాడీ) రాహుల్ శర్మ, జిల్లా రెవెన్యూ అధికారి అశోక్ కుమార్, అసిస్టెంట్ ట్రైనీ కలెక్టర్ సంచిత్ గంగ్వార్, అన్ని శాఖల అధికారులు పాల్గొన్నారు.