ఘనంగా పోషకాహార మాసోత్సవాలు ముఖ్య అతిథులుగా ఏసి డిపిఓ కమల ప్రియ హాజరు

Published: Friday September 02, 2022
బోనకల్, సెప్టెంబర్ 1 ప్రజా పాలన ప్రతినిధి: పోషకాహార కార్యక్రమంలో భాగంగా గురువారం మండలంలోని అన్ని గ్రామాల్లో పోషకాహార మాసోత్సవాలను ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా అన్ని అంగన్వాడి సెంటర్లలో తల్లులతో మీటింగులు, ఫుడ్ డెమోనిస్ట్రేషన్ ర్యాలీ, ప్రతిజ్ఞలు, ప్లకార్డుల ప్రదర్శనలు చేపట్టడం జరిగింది. ఈ సందర్భంగా ఏసీడీపీఓ కమల ప్రియ మాట్లాడుతూ పోషకాహార లోపం వల్ల ప్రతి సంవత్సరం 52% మరణాలు సంభవిస్తున్నాయని, 46% పిల్లలు వయసు తగ్గ బరువు ఉండటం లేదని, 28 శాతం పిల్లలు వయసుకు తగ్గ ఎత్తు ఉండటం లేదని తెలియజేశారు. పోషకాహార లోపం వలన పిల్లలకు వాంతులు విరోచనాలు అవటం వలన పిల్లలు బరువును కోల్పోతున్నారని తెలిపారు. పోషకాహార లోపం అధిగమించాలంటే బిడ్డ పుట్టిన గంటలోపు తల్లిపాలను పట్టించాలని, ఆరు నెలలు వరకు కేవలం తల్లిపాలని తాగించాలని, ఆరు నెలలు నిండిన తర్వాత రెండు సంవత్సరాలు వచ్చు వరకు తల్లిపాలను కొనసాగిస్తూ సంతులిత ఆహారాన్ని అందించాలని ఆమె అన్నారు. ప్రతి నెల పిల్లల బరువులు ఎత్తులు పరిశీలించి వారి పోషణ స్థితిని గుర్తించాలని అన్నారు. ఆరు నెలలు నిండిన తర్వాత అంగన్వాడీ సెంటర్లో లభించే బాలామృతంను జావలాగా తినిపించాలని, బాలామృతం తినిపించడం వలన అనేక రకాల పోషక విలువలు ఉంటాయన్నారు. 9 నెలలు నిండిన తర్వాత అరటి, బొప్పాయి, యాపిల్ వంటి పళ్ళను తినిపించవచ్చునని, గుడ్లు, పాలు, నెయ్యి పిల్లలకు అందించాలని, తద్వారా పోషక ఆహార లోపం నుండి పిల్లలను కాపాడవచ్చునని తెలిపారు. పోషకాహార లోపం వల్ల పిల్లల ఎదుగుదల తగ్గడమే కాకుండా జ్ఞాపకశక్తిని కూడా కోల్పోయి రోగాల బారిన పడతారని తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ భూక్యా సైదా నాయక్, సూపర్వైజర్ రమాదేవి, వైస్ ఎంపీపీ గుగులోతు రమేష్, ఉప సర్పంచ్ యార్లగడ్డ రాఘవ, అంగన్వాడి టీచర్లు రమాదేవి, నాగమణి, శిరీష, ప్రసూనాంబ, విజయలక్ష్మి, రమణ తదితరులు పాల్గొన్నారు.