వికారాబాదులో షూటింగ్ బాల్ క్రీడలు

Published: Wednesday February 16, 2022
షూటింగ్ బాల్ రాష్ట్ర అధ్యక్షుడు పెద్దింటి నవీన్ కుమార్
వికారాబాద్ బ్యూరో 15 ఫిబ్రవరి ప్రజాపాలన : ఈనెల 19 నుంచి జిల్లా కేంద్రంలోని బ్లాక్ గ్రౌండ్ లో షూటింగ్ బాల్ క్రీడలు జరుగుతాయని షూటింగ్ బాల్ రాష్ట్ర అధ్యక్షుడు పెద్దింటి నవీన్ కుమార్ అన్నారు. మంగళవారం స్థానిక శ్రీ వివేకవాణి విద్యాలయంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామీణ స్థాయి క్రీడాకారులను ప్రోత్సహించడమే లక్ష్యంగా కొత్తకొత్త ఆటలను పరిచయం చేస్తున్నామని పేర్కొన్నారు. గతంలో లగోరీ, స్పీడ్ బాల్, లంగిడీ వంటి క్రీడలను వికారాబాద్ కు పరిచయం చేశామని గుర్తు చేశారు. వికారాబాద్ లో రాష్ట్రస్థాయి జాతీయస్థాయి క్రీడలను నిర్వహించామని స్పష్టం చేశారు. షూటింగ్ బాల్ క్రీడా వాలిబాల్ మాదిరిగా ఉంటుందని, కానీ బాల్ మాత్రం చిన్నగా ఉంటుందని వివరించారు. షూటింగ్ బాల్ క్రీడలో 12 మంది ఆటగాళ్లు ఉంటారని, ఏడు మంది మాత్రమే ఆడతారని ఉద్ఘాటించారు. ఇప్పటివరకు 39 సార్లు జాతీయ క్రీడలు నిర్వహించామని తెలిపారు. షూటింగ్ బాల్ కు ఎంసెట్లో 2 శాతం రిజర్వేషన్ కలదని అన్నారు. మూడు రోజుల పాటు జరిగే షూటింగ్ బాల్ క్రీడలకు ముఖ్య అతిథులుగా మాజీ మంత్రి బిజెపి నాయకులు ఎ.చంద్రశేఖర్, బిజెపి జిల్లా అధ్యక్షులు సదానంద్ రెడ్డి, వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ ఆనంద్, మున్సిపల్ చైర్ పర్సన్ చిగుళ్ళపల్లి మంజుల రమేష్, వైఎస్ఆర్ టిపి జిల్లా అధ్యక్షుడు తమ్మలి రాజు పాల్గొంటారని పేర్కొన్నారు. ఈ సమావేశంలో శ్రీ వివేక వాణి విద్యాలయం ప్రిన్సిపాల్ మంగ నాగయ్య, రాష్ట్రస్థాయి క్రీడాకారుడు విశాల్ పాల్గొన్నారు.