ప్రణాళికాబద్ధంగా నిర్దేశించుకున్న లక్ష్యం పూర్తి

Published: Friday December 30, 2022
ఐదు అంశాలపై ప్రత్యేక దృష్టి పెట్టి సఫలీకృతం
* అసాంఘిక కళాపాలపై ఉక్కు పాదం
* నేరస్తులను చాకచక్యంగా పట్టుకున్న పోలీసులకు సన్మానం

* జిల్లాలో నిఘనేత్రాలు అమర్చేందుకు కృషి

* మీడియా సమావేశంలో జిల్లా ఎస్పీ కోటిరెడ్డి
వికారాబాద్ బ్యూరో 29 డిసెంబర్ ప్రజాపాలన : ప్రజలకు రక్షణ కల్పించడమే ప్రధాన లక్ష్యంగా కృషి చేస్తున్నామని జిల్లా ఎస్పీ ఎన్ కోటిరెడ్డి అన్నారు. గతంలో కంటే ఈ సంవత్సరం క్రైమ్ రేటు తగ్గించుటకు ప్రత్యేక కార్యాచరణను రూపొందించామని స్పష్టం చేశారు. గురువారం జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ ఎన్ కోటిరెడ్డి మాట్లాడుతూ నిర్దేశించుకున్న లక్ష్యాలను పూర్తి చేయుటకు అధికారులు సిబ్బంది ప్రత్యేక కృషి చేశారని కొనియాడారు. అండర్ ఇన్వెస్టిగేషన్, ఎన్ఫోర్స్మెంట్, రోడ్ యాక్సిడెంట్ కేసుల తగ్గింపు, ఆత్మహత్య కేసుల తగ్గింపు, సీసీటీవీ ల సంఖ్య పెంచడం వంటి ఐదు అంశాలపై ప్రత్యేక దృష్టి పెట్టి నేరాల రేటును 12 శాతం తగ్గించామని స్పష్టం చేశారు.
అండర్ ఇన్వెస్టిగేషన్ కేసుల తగ్గింపు :
 2021 సంవత్సరంలో 12 17 కేసులు వచ్చినవని, 2022 సంవత్సరంలో 35 23 కేసులు నమోదు కాగా 923 కేసులను పరిష్కరించామని వివరించారు. 
ఎన్ఫోర్స్మెంట్ : 
అసాంఘిక కార్యకలాపాలను అదుపులో పెట్టుటకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించి కేసులను తగ్గించామని చెప్పారు. గుట్కా ఇసుక కలప ఎన్డిపిఎస్ మట్కా పేకాట పిడిఎస్ బియ్యం నకిలీ విత్తనాలు మొదలగు విషయాలపై గట్టి నిఘా వ్యవస్థను ఏర్పాటు చేసి నేర నివారణకు కృషి చేశామని తెలిపారు. గత సంవత్సరంలో 344 అసాంఘిక కేసులను అదుపు చేయగా ఈ సంవత్సరము 571 కేసులను అదుపు చేసి 66 శాతానికి తగ్గించడం విశేషమని ప్రశంసించారు. నకిలీ విత్తనాలు అరికట్టడం పై ప్రత్యేక దృష్టి పెట్టవలసి ఉందని అన్నారు.
రోడ్ యాక్సిడెంట్ కేసుల తగ్గింపు : 
రోడ్డు యాక్సిడెంట్ జరగకుండా ప్రత్యేకంగా బందోబస్తు నిర్వహించాల్సి ఉందని పేర్కొన్నారు. ఎక్కడో ఒకచోట రోడ్డు ప్రమాదాలు జరిగి కుటుంబాలకు నష్టం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఎంవి యాక్ట్, లేజర్ గన్, డ్రంక్ అండ్ డ్రైవ్, ఈ పెట్టి కేసులలో మొత్తం 7937 కేసులు నమోదు చేసి రోడ్డు ప్రమాదాలు నివారించేందుకు కృషి చేశామని అన్నారు. గత సంవత్సరంలో 423 కేసులు నమోదు కాగా ఈ సంవత్సరము 297 కేసులకు తగ్గించుటకు విశేష కృషి చేసిన మా పోలీసు సిబ్బందిని అభినందిస్తున్నానన్నారు. మొత్తానికి 29.78 శాతానికి తగ్గడం అభినందించాల్సిన విషయం అని స్పష్టం చేశారు. 
ఆత్మహత్య కేసుల తగ్గింపు :
మానసికంగా ప్రతి చిన్న విషయానికి సుదీర్ఘంగా ఆలోచించి మనోవేదనకు గురై ఆత్మహత్యలే శరణ్యమని చావుకు సిద్ధమవుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఆత్మహత్యల నివారణ కొరకు ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో కళాజాతర బృందంతో 139 అవగాహన కార్యక్రమాలు నిర్వహించామని వివరించారు. జీవితాన్ని దేవుడు ఇచ్చిన వరమని దాన్ని సక్రమంగా నిర్వర్తించుకుంటే మీ జీవితంతో పాటు మీ కుటుంబం కూడా బాగుపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
సీసీటీవీ ల సంఖ్య పెంచుట : 
ఒక్క సీసీటీవీ 100 మంది పోలీసు అధికారులతో సమానం అనే విషయాన్ని ప్రజాక్షేత్రంలోకి తీసుకెళ్లేందుకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. నేను సైతం, కమ్యూనిటీ పోలీసింగ్ వంటి కార్యక్రమాలను కమాండ్ అండ్ కంట్రోల్ కు అనుసంధానం చేసి శాంతి భద్రతలను పరిశీలిస్తున్నామని చెప్పారు. 2021 లో కమ్యూనిటీ పోలీసింగ్ ద్వారా 542, 2022లో 1110 నిఘా నేత్రాలను అమర్చామన్నారు. నేను సైతం కార్యక్రమం ద్వారా గత సంవత్సరం 254 సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేయగా ఈ సంవత్సరం 1171 సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి నేరాలను నియంత్రించేందుకు కృషి చేశామని వివరించారు. 2022 లో దొంగతనం, హెచ్బిఎస్ బై డే, హెచ్బిఎస్ బై నైట్, హత్య, దోషపూరిత నరహత్య, అల్లర్లు, కిడ్నాపింగ్ అపహరణ, మానభంగం, రక్త గాయాలు, సాధారణ గాయాలు, మోసం, హత్యా ప్రయత్నం, ప్రాణాంతకం, ప్రాణాంతకం లేనివి, రహదారిపై గాయాలు లేనివి 
లాభం కోసం హత్య, దోపిడీ, నేరవిశ్వాస ఉల్లంఘన వంటి నేరాలలో 100% విజయం సాధించామని సంతోషం వ్యక్తం చేశారు. సాధారణ దొంగతనాల కేసులు పెరగడం విచారకరమని ఆవేదన వ్యక్తం చేశారు. మొత్తానికి 20 22 సంవత్సరములో క్రైమ్ రేట్ ను 12.71 శాతానికి తగ్గించడానికి కృషి చేసిన పోలీస్ సిబ్బంది అధికారులకు అనధికారులకు ప్రత్యేక అభివందనాలు తెలిపారు. ఈ సమావేశంలో జిల్లా అడిషనల్ ఎస్పీ ఎంఏ రషీద్ డిఎస్పీలు సత్యనారాయణ శేఖర్ గౌడ్ కరుణాసాగర్ రెడ్డి సిఐలు వెంకటేశం దాసు అప్పయ్య నాగేశ్వరరావు శ్రీనివాస్ ప్రమీల తదితరులు పాల్గొన్నారు.