ఉపాధి హమీ పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేయాలి

Published: Saturday December 24, 2022
ఎమ్మెల్యేలు డాక్టర్ మెతుకు ఆనంద్, కొప్పుల మహేష్ రెడ్డి
వికారాబాద్ బ్యూరో 23 డిసెంబర్ ప్రజా పాలన : ఉపాధి హమీ పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేయాలని వికారాబాద్ జిల్లా భారత రాష్ట్ర సమితి పార్టీ అధ్యక్షుడు ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి డిమాండ్ చేశారు. శుక్రవారం ఎన్టీఆర్ చౌరస్తాలో భారత రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో
కేంద్ర ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ధర్నా చేసి నరేంద్ర మోడీ దిష్టి బొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం రైతన్నల కోసం చేపట్టిన వ్యవసాయ కళ్ళాల నిర్మాణాన్ని తప్పుపడుతూ, రాష్ట్రంలో ఉపాధి హామీ నిధుల మళ్లింపు అంటూ కేంద్ర ప్రభుత్వం చేస్తున్న దుష్ప్రచారం తగదన్నారు. రైతు వ్యతిరేక వైఖరికి నిరసనగా, ముఖ్యమంత్రి కెసిఆర్, కేటీఆర్ పిలుపు మేరకు నిరసన ధర్నా  చేసి కేంద్ర ప్రభుత్వ దిష్టి బొమ్మను దహనం చేశారు.
రైతు వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. రైతుల పక్షాన సీఎం కేసీఆర్ నాయకత్వంలో పెద్ద ఎత్తున ఆందోళన చేపడుతామని కేంద్రాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు తదితరులు పాల్గొన్నారు.