శరీరానికి అవసరమగు లవణాల శాతం మిషన్ భగీరథ నీటిలో లభ్యం

Published: Saturday July 02, 2022
మిషన్ భగీరథ ఈఈ బాబు శ్రీనివాస్
వికారాబాద్ బ్యూరో జూలై 01 ప్రజా పాలన : శరీరానికి అవసరమగు లవణాల శాతం మిషన్ భగీరథ నీటిలో లభ్యం అవుతుందని మిషన్ భగీరథ ఈఈ బాబు శ్రీనివాస్ అన్నారు. శరీరానికి కావలసిన లవణాలు అంది నీరసపడకుండా అంతర్గత అవయవాలు సరిగ్గా పని చేసేందుకు దోహదపడుతుందని పేర్కొన్నారు. శుక్రవారం వికారాబాద్ మండలం, గొట్టిముక్కుల గ్రామంలో మిషన్ భగీరథ త్రాగు నీటిపై కలిగే ప్రయోజనాలు, ఇతర నీటి వినియోగం వల్ల కలిగే దుష్ప్రయోజనాలపై ప్రజలకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు.  ఈ సందర్బంగా మిషన్ భగీరథ ఇ ఇ బాబు శ్రీనివాస్ మాట్లాడుతూ, గ్రామంలో ప్రతి ఒక్కరు మిషన్ భగీరథ నీరు త్రాగాలని, ఈ నీటి వినియోగం వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుందని, అలాగే శరీరంలోని అన్ని అవయవాల పని తీరు మెరుగు పడి ఆరోగ్య సమస్యలు తగ్గుతాయన్నారు.  త్రాగు నీరు కలుషితం కాకుండా గ్రామాలలో ప్రతి 10 పది రోజులకు ఒక సారి నీటి నిల్వ ట్యాంకులను బ్లీచింగ్ పౌడర్ తో శుద్ది చేయాలన్నారు.  నీటి పైప్ లైన్ లీకేజీ కాకుండా చూసుకోవాలన్నారు. ఆర్ఓ వాటర్ డబ్బా నీరు త్రాగడం వల్ల నీటిలో లవణ శాతం తగ్గి శరీరంలోని అవయవాల పని తీరు తగ్గి అనారోగ్య సమస్యలు వస్తాయన్నారు.  ఫ్లోరైడ్ స్థాయి తగ్గడం వల్ల మోకాళ్ళ నొప్పులు, చిన్న పిల్లలలో ఎదుగుదల, ఎముకలు మెత్తబడే అవకాశాలు ఉంటాయని అన్నారు. రాష్ట్ర ప్రభత్వం పెద్ద ఎత్తున నిధులు వెచ్చెంచి ప్రతి ఇంటికి స్వచ్ఛమైన త్రాగునీరు అందిస్తున్నందున మిషన్ భగీరథ నీరు త్రాగి ఆరోగ్యంగా ఉండాలని కోరారు.  జిల్లాలోని 19 మండలాలలోని అన్ని గ్రామ పంచాయతీలలో ఈరోజు నుండి నెల రోజుల పాటు మిషన్ భగీరథ నీరు త్రాగే విధంగా అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నట్లు అయన తెలియజేసినారు. ఈ కార్యక్రమంలో డి ఇ రత్నప్రసాద్, నీటి నాణ్యత పరిశీలకుడు ఉదయ్ రామ్ గ్రామ సర్పంచ్ వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.
 
 
 
Attachments area