మంచిర్యాల సత్యాగ్రహ సభను విజయవంతం చేయాలి

Published: Thursday April 13, 2023
 జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు టి.రాంమోహన్ రెడ్డి
వికారాబాద్ బ్యూరో 12 ఏప్రిల్ ప్రజాపాలన : ప్రధాని మోడీ విదేశీ పర్యటనలకు అదాని వెళ్ళడమేమిటని జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పరిగి మాజీ ఎమ్మెల్యే టి.రాంమోహన్ రెడ్డి ప్రశ్నించారు. బుధవారం మున్సిపల్ పరిధిలోని సాకేత్ నగర్ లో గల మాజీ మంత్రి గడ్డం ప్రసాద్ కుమార్ నివాసంలో కాంగ్రెస్ పార్టీ ఫ్లోర్ లీడర్ అర్థ సుధాకర్ రెడ్డి ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఎఐసిసి అధ్యక్షుడు, పార్లమెంట్ ప్రతిపక్ష నాయకుడు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, టిపిసిసి అధ్యక్షుడు మల్కాజిగిరి ఎంపి ఎనుముల రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు ఏప్రిల్ 14న మంచిర్యాలలో ఏర్పాటు చేయనున్న సత్యాగ్రహ సభను విజయవంతం చేద్దామని పిలుపునిచ్చారు. నీరవ్ మోదీ, లలిత్ మోదీ, నరేంద్రమోదీలను ఉద్దేశించి మోదీలంతా దేశాన్ని దోచుకునే దొంగలని రాహుల్ గాంధీ చేసిన ఆరోపణతో సూరత్ కోర్టు పార్లమెంటు సభ్యత్వాన్ని రద్దు చేయడం, వెనువెంటనే జైలు శిక్ష విధించబం సమంజసం కాదని అన్నారు. రాహుల్ గాంధీ పార్లమెంట్ సభ్యత్వాన్ని నిర్ణీత సమయం ఇవ్వకుండా రద్దు చేయడం దుర్మార్గపు చర్య అని విమర్శించారు. పార్లమెంట్ క్వార్టర్ ఖాళీ చేయమనడం నీతిమాలిన చర్య అని ధ్వజమెత్తారు. బిఆర్ అంబేద్కర్ జయంతి ఏప్రిల్ 14న పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టనున్నామని స్పష్టం చేశారు. జబ్ తక్ సూరజ్ చాంద్ రహేగా తబ్ తక్ రాహుల్ గాంధీ నామ్ రహేగా అనే విధంగా పోరాటం చేద్దామన్నారు. అదాని, నరేంద్ర మోదీ ద్వయం ప్రజలు దాచుకున్న డబ్బులను దోచుకు తింటున్నారని ఆరోపించారు. రైతు వ్యతిరేక చట్టాలు, నోట్ల రద్దు వంటి వాటికి సిఎం కెసిఆర్ మద్దతు తెలిపి, నేడు విమర్శించడంలో ఆంతర్యమేమిటని ప్రశ్నించారు. మంచిర్యాలలో జరిగే సత్యాగ్రహ సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్మన్ వి.సత్యనారాయణ, కౌన్సిలర్ జైదుపల్లి మురళి, కాంగ్రెస్ నాయకులు రెడ్యానాయక్,
చాపల శ్రీనివాస్ ముదిరాజ్, ఆసిఫ్, బాలకృష్ణ, విజయ్ కుమార్, నవీన్, మహేందర్  తదితరులు పాల్గొన్నారు.