రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం కృషి

Published: Tuesday May 25, 2021

ప్రభుత్వ విప్ బాల్క సుమన్
మంచిర్యల జిల్లా ప్రతినిధి, మే 24, ప్రజాపాలన : రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం ఎన్నో పథకాలు ప్రవేశపెట్టి అమలు చేస్తుందని, కావిడ్-19 విపత్కర పరిస్థితుల్లో సైతం రైతులు ఇబ్బందులు పడకుండా అనేక చర్యలు తీసుకుంటుందని చెన్నూర్ నియోజకవర్గ శాసనసభ్యులు, ప్రభుత్వ విప్ బాల్క సుమన్ అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ భవన సమావేశ మందిరంలో బెల్లంపల్లి శాసనసభ్యులు దుర్గం చిన్నయ్య, డి.సి.సి.బి. చైర్మన్ తిప్పని లింగయ్యతో కలిసి వరిధాన్యం కొనుగోలు ప్రక్రియపై పాత్రికేయుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ మాట్లాడుతూ రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం అహర్నిశలు పాటు పడుతుందని, జిల్లాలో వ్యవసాయ శాఖ అంచనా ప్రకారం 2 లక్షల 42 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం పండిందని, ఇప్పటి వరకు 90 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయడం జరిగిందని తెలిపారు. మంచిర్యాల జిల్లాలో నిర్ధేశించిన ధాన్యం కొనుగోలు లక్ష్యానికి మించి ఉన్న ధాన్యాన్ని కరీంనగర్, జగిత్యాల, పెద్దపల్లి, వరంగల్ జిల్లాలకు నిబంధనల మేరకు తరలించడం జరుగుతుందని, ధాన్యం తరలింపు పెండింగ్లో ఉన్న కొనుగోలు కేంద్రాలకు లారీలు పంపించి లోడింగ్ చేసి కేటాయించిన ప్రకారముగా రైన్ మిల్లులకు తరలించాలని, రైతులు ఇబ్బంది పడకుండా ప్రస్తుత కొవిడ్-19 నేపథ్యంలో త్వరగా పంపించడం జరుగుతుందని తెలిపారు. లాక్ డౌన్ సమయంలో ఇంత పెద్ద ఎత్తున ధాన్యాన్ని కొనుగోల చేసిన ఘనత రాష్ట్ర ముఖ్యమంత్రిదే అని, దేశంలో ఏ రాష్ట్రం కొనుగోలు చేయని విధంగా తెలంగాణ రాష్ట్రంలో 55 లక్షల మెట్రిక్ టన్నుల వరిధాన్యం రైతుల వద్ద నుండి కొనుగోలు చేయడం జరిగిందని అన్నారు. విడ్ నిబంధనలు ఖచ్చితంగా అమలు చేస్తూ ప్రజల ఆరోగ్య రీత్యా లాక్డౌన్ విధించడం జరిగిందని, ఈ తరుణంలో సైతం రైతులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా, నష్టపోకుండా ధాన్యం కొనుగోలు చేయడం జరిగిందని, కొవిడ్ వ్యాధిగ్రస్తుల కోసం వైద్య ఆరోగ్యశాఖ అధికారులతో కలిసి అన్ని రకాల రక్షణ చర్యలు తీసుకోవడంతో పాటు కరోనా వైరనై పై ప్రజల్లో పూర్తి స్థాయి అవగాహన కల్పించే విధంగా కృషి చేశారని తెలిపారు.