అభివృద్ధి పనులలో ఎలాంటి జాప్యం లేకుండా త్వరగా పూర్తి చేయాలి : జిల్లా కలెక్టర్ భారతి హోళికేరి

Published: Tuesday September 21, 2021
మంచిర్యాల బ్యూరో, సెప్టెంబర్ 20, ప్రజాపాలన : జిల్లాలోని చెన్నూర్ నియోజకవర్గ పరిధిలో జరుగుచున్న అభివృద్ధి పనులలో ఎలాంటి జాప్యం లేకుండా త్వరగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ భారతి హోళికేరి అధికారులను ఆదేశించారు. సోమవారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ భవన నముదాయంలో గల కలెక్టర్ చాంబర్లో పంచాయతీరాజ్, రోడ్డు- భవనాలు, మిషన్ భగీరథ, నీటి పారుదల శాఖల అధికారులు, మున్సిపల్ అధికారులు, సంబంధిత శాఖల అధికారులతో అభివృద్ధి పనులపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ చెన్నూర్ నియోజకవర్గ పరిధిలో మిషన్ భగీరథ పథకంలో భాగంగా జరుగుచున్న నల్లా కనెక్షన్లు, పైప్ లైన్ పనులపై సంబంధిత అధికారులపై ఆగ్రహం వెలిబుచ్చారు. మిషన్ భగీరథ కార్యక్రమంలో భాగంగా ఇవ్వవలసి నల్లా కనెక్షన్లలో 1000 ఇండ్లకు కనెక్షన్ ఇవ్వడంలో జాప్యంతో పాటు చెన్నూర్ మున్సిపల్ పరిధిలో జరుగుచున్న పనులపై అసహనం వ్యక్తం చేశారు. పెద్ద చెరువు క్రింద మిగతా పనులను త్వరగా పూర్తి చేయాలని, మొక్కలు నాటి సంరక్షణ చర్యలు చేపట్టాలని తెలిపారు. దనరా, బతుకమ్మ పండుగ సమీపిస్తున్నందున చెరువు సమీపంలోని శివాలయంకు వెళ్ళే దారి ఏర్పాటు త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. పారిశుద్ధ్య నిర్వహణలో భాగంగా నివాసాల నుండి చెత్తను తడి, పొడి క్రింద వేర్వేరుగా సేకరించి డంపింగ్ యార్డుకు తరలించాలని, వర్షాకాలం కావడంతో నీరు నిల్వ లేకుండా పరిశుభ్రంగా ఉంచాలని, మురుగుకాలువలలో పూడిక లేకుండా ఎప్పకటప్పుడు శుభ్రపర్చాలని తెలిపారు. సంబంధిత పనులను త్వరగా పూర్తి చేయాలని, లేని పక్షంలో అధికారులపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ రాజ్ ఈ.ప్రకాష్, రోడ్డు భవనాల శాఖ ఈ. ఈ.రాము, మిషన్ భగీరథ డి.ఈ.వెంకటేష్, పంచాయతీరాజ్ డి.ఈ.స్వామిరెడ్డి, మున్సిపల్ అధికారులు సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.