భారీ వర్షాల దృశ్యం ప్రజలు అప్రమత్తంగా ఉండాలి జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్

Published: Monday July 11, 2022
ఆసిఫాబాద్ జిల్లా జూలై10(ప్రజాపాలన, ప్రతినిధి) : భారీవర్షాల దృశ్య జిల్లాలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని, అధికార యంత్రాంగం ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ భవనం నుండి టెలీకాన్ఫరెన్స్ ద్వారా మండలాల తహసీల్దార్లు, మండల పరిషత్ అభివృద్ధి అధికారులతో వరద పరిస్థితులపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రాబోయే 48 గంటల్లో భారీ వర్ష సూచన ఉన్నందున ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అధికారులు జాగ్రత్తలు చేపట్టాలని, లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని, పాత ఇండ్లు, శిధిలావస్థలో ఉన్న నివాసాలలో ఉండే ప్రజలు మరింత జాగ్రత్తగా ఉండాలని తెలిపారు. మండలాల పరిధిలో జలమయమయ్యే రోడ్లు, గ్రామాలలో ఆయా మండలాల తహసీల్దార్లు, మండల పరిషత్ అభివృద్ధి అధికారులు, అప్రమత్తంగా ఉంటూ సహాయక చర్యలు చేపట్టాలని, నీటి ప్రవాహం ఉండే ప్రాంతాలలో  బారికేడ్లు, గ్రూపులను ఏర్పాటు చేయాలని, ప్రమాదకర దారులను మూసివేసి ట్రాఫిక్ను మళ్లించాలని తెలిపారు. జిల్లాలో అత్యధిక వర్షపాతం నమోదయ్యే మండలాలైన చింతల మానేపల్లి, పెంచికల్పేట్, జైనూర్, తిర్యాని, కెరమెరి, లింగాపూర్, రెబ్బెన ప్రాంతాలలో ఉప్పొంగుతున్న వాగులు, వంతెనలు, రెవెన్యూ, పోలీస్, పంచాయతీ బృందాలు నిరంతరం గస్తీ కాస్తూ, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా  చర్యలు తీసుకోవాలన్నారు. ప్రజల సౌకర్యార్థం కలెక్టరేట్ భవనం లో కంట్రోల్ రూం ఏర్పాటు చేయడం జరిగిందని, 18005991200, 08733 27933, నెంబర్లను సంప్రదించాలని తెలిపారు.
 
 
 
Attachments area