అగ్నిపథ్ పథకాన్ని రద్దు చేయాలిసీఎల్పీ లీడర్ మల్లు భట్టి విక్రమార్క

Published: Tuesday June 28, 2022

మధిర జూన్ 27 ప్రజాపాల ప్రతినిధి మున్సిపాలిటీ పరిధిలో సోమవారం నాడు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆర్మీలో ఉద్యోగాల కోసం కేంద్ర ప్రభుత్వం తాజాగా తీసుకువచ్చిన అగ్నిపథ్ పథకాన్ని తక్షణమే రద్దు చేయాలని రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ శాసనసభ పక్ష నేత మధిర ఎమ్మెల్యే మల్లు భట్టి విక్రమార్క డిమాండ్ చేశారు. సోమవారం ఖమ్మం జిల్లా మధిరలో నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అగ్నిపథ్ పథకాన్ని నిరసిస్తూ సత్యాగ్రహం చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ  ఆర్మీ ఉద్యోగాల నియామకాలను పాత పద్ధతిలోనే  కొనసాగించాలని ఆయన సూచించారు. ఆర్మీలో అగ్నిపథ్ పథకం పేరుతో నిరుద్యోగుల జీవితాలతో ఆటలాడుకునే విధానాన్ని విరమించుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఇప్పటికే నిరుద్యోగులు ఆర్మీలో ఉద్యోగాలు పొందేందుకు ప్రభుత్వం గత సంవత్సరం మార్చి 26 నుండి 30 వరకు పరుగు పందెం దేహదారుఢ్య పరీక్షలు నిర్వహించి రాత పరీక్ష రాసేందుకు అర్హులను ఎంపిక చేయడం జరిగిందన్నారు. అర్హత సాధించిన వారికి రాత పరీక్ష నిర్వహించాల్సి ఉందన్నారు. కరోనా కారణంగా రాతపరీక్ష వాయిదా వేశారు. అర్హత పొందిన అభ్యర్థులు రాత పరీక్ష రాసేందుకు శిక్షణలో ఉండగా కేంద్ర ప్రభుత్వం రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ రద్దు చేయడం వల్ల నిరుద్యోగులు తీవ్ర ఆందోళనకు గురయ్యారని ఆయన పేర్కొన్నారు. అంతేకాకుండా కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన అగ్నిపద్ పథకం వలన అగ్ని వీరులకు ఎటువంటి ఉపయోగం లేదన్నారు. ఎంతో కష్టపడి మిలటరీలో ఉద్యోగం పొందిన వారు నాలుగేళ్లలో కేవలం 25 శాతం మందినే పర్మినెంట్ చేసి మిగతా వారిని ఎటువంటి ఉద్యోగ బెనిఫిట్స్ లేకుండా తొలగించడం దుర్మార్గమన్నారు. ఇటువంటి పథకాన్ని తక్షణమే రద్దు చేసి పాత విధానం ద్వారానే ఆర్మీ ఉద్యోగ నోటిఫికేషన్ ఇవ్వాలన్నారు