మండలంలో ఘనంగా దుర్గామాత శోభయాత్ర కార్యక్రమం

Published: Friday October 07, 2022

బోనకల్, అక్టోబర్ 6 ప్రజా పాలన ప్రతినిధి:వైభవంగా దుర్గామాత ప్రతిమల శోభాయాత్ర మండల కేంద్రమైన బోనకల్ లోని బోసు బొమ్మ సెంటర్, సొసైటీ సెంటర్, ఎల్ఐసీ బజార్, గ్రంధాలయం సెంటర్, హైస్కూల్ సెంటర్ లతో మండల పరిధిలో రావినూతల గ్రామంలో బడి తండా, తూర్పు తండా దుర్గామాత ఉత్సవ కమిటీ ఆధ్వర్యంతో పాటు మండలంలో పలు గ్రామాల్లోని దుర్గామాత ప్రతిమలు శోభాయాత్ర ప్రధాన వీధుల గుండా కొనసాగింది. మండల వ్యాప్తంగా దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు ఈ నెల 5వ తేదీతో ముగియడంతో అమ్మవార్ల ప్రతిమలను భక్తులు నిమజ్జనానికి తరలించారు. గత నెల 26 నుండి నుంచి ప్రారంభమైన నవరాత్రి ఉత్సవాలు విజయదశమితో ముగిశాయి. గత పది రోజులపాటు అంగరంగ వైభవంగా పూజలందుకున్న దేవీమాత గురువారం నిమజ్జనానికి తరలివెళ్లాయి. సెక్టెంబర్ 26 నుంచి ప్రారంభమైన దేవీమాత ఉత్సవాలు బుధవారం వరకు వైభవంగా జరిగాయి. అమ్మవార్లకు యధాశక్తిగా ఉత్తర పూజలు జరిపారు. ఏటికేడు అమ్మవారి మండపాలు పెరుగుతూ ఉండడంతో పాటు వేడుకల్లో అంతకంతకు సెట్టింగ్‌లతో పూజలు నిర్వహించారు. అమ్మవారు రోజుకొక రూపంలో భక్తుల పూజలు అందుకుంది. భక్తులు కుంకుమపూజలు, అర్చనలు, అన్నదానములు నిర్వహించారు. భక్తులు రకరకాల ప్రసాదాలను నైవేద్యం సమర్పించుకున్నారు. దేవీమాత శోభయాత్ర జరిగిన దారిపొడవున భక్తులు మంగళహారతులను, కొబ్బరి కాయలను, నైవేద్యాలను సమర్పించుకున్నారు. అమ్మవారి ముందు మహిళలు, యువతులు, చిన్నారులు నృత్యాలు చేస్తూ తన్మయత్వం చెందారు. బాణ సంచాలను కల్చుతూ, అమ్మవారికి స్వాగతం పలికారు. పలు దేవీమాత మం డళ్ల నిర్వాహకులు అమ్మవారికి ప్రసాదం దారిపొడవున భక్తులకు పంపిణీ చేశారు. జై భోలో జగదంబే, దేవీమాతకు జై.. జైజై మాత.. అని నినదిస్తూ భక్తులు అమ్మవారిని నిమజ్జనానికి తరలించారు.