అన్ని ప్రభుత్వ శాఖల సమన్వయంతో డ్రగ్, గంజాయి, గుడుంబాను అరికట్టాలి : జిల్లా కలెక్టర్ భారతి హోళ

Published: Tuesday February 08, 2022
మంచిర్యాల బ్యూరో‌, ఫిబ్రవరి 7, ప్రజాపాలన : కుటుంబాలు రోడ్డున పడేందుకు కారణమైన డ్రగ్స్, గంజాయి, గుడుంబా వినియోగం నియంత్రించడంలో అన్ని ప్రభుత్వ శాఖల అధికారులు సమన్వయంతో పని చేయాలని జిల్లా కలెక్టర్ భారతి హోళ్ళికేరి అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ భవన సమావేశ మందిరంలో జిల్లా అదనపు కలెక్టర్ మధుసూదన్ నాయక్, ట్రైనీ కలెక్టర్ ప్రతిభా సింగ్, ఎ.సి.పి. సాధన రష్మి పెరుమాల్ తో కలిసి మాదకద్రవ్యాలు, గంజాయి, గుడుంబా నిర్మూలనకు జిల్లా మద్యపాన నిషేద, ఆబ్కారీ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జిల్లా స్థాయి సమన్వయ సమావేశానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ 44 శాతం అడవులు ఉన్న జిల్లాలో గంజాయి సాగుతో పాటు గుడుంబా తయారు చేసి సరఫరా చేయడంతో పాటు చాలా మంది వినియోగించి మత్తుకు బానిసలై తమ జీవితాలను కోల్పోతున్నారని అన్నారు. మారుమూల కుగ్రామాల పరిసరాల ప్రాంతాలలోని అటవీ భూములు, ఆర్.ఓ.ఎఫ్.ఆర్. పట్టా క్రిందకు వచ్చు భూములలో అక్రమంగా గంజాయి సాగు చేయడంతో పాటు గుడుంబా తయారు చేసి గుట్టుగా సరఫరా చేస్తున్నారని, పోలీసు, రెవెన్యూ, ఎక్సైజ్, పంచాయతీరాజ్, అటవీ శాఖల సమన్వయంతో అప్రమత్తంగా ఉండి, సాంకేతికతను పూర్తి స్థాయిలో వినియోగించి గ్రామ స్థాయిలోనే అరికట్టే విధంగా చర్యలు తీసుకోవాలని అన్నారు., గ్రామాలలో మత్తు పదార్థాల వినియోగం, కలిగే నష్టాలపై ప్రజలకు అవగాహన సదస్సులు నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. ఎ.సి.పి. మాట్లాడుతూ దేశ భవిష్యత్తు యువతపై ఆధారపడి ఉందని, యువత చెడుమార్గాలలోకి వెళ్ళకుండా తల్లిదండ్రులు ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. వీటితో పాటు కొకైన, హెరాయిన్ ఇతరత్రా మాదకద్రవ్యాల అక్రమ రవాణాకు పాల్పడినా, విక్రయాలు జరిపినా వారిపై పి.డి. యాక్టు నమోదు చేయడం జరుగుతుందని తెలిపారు. మంచిర్యాలను మాదకద్రవ్య రహిత జిల్లాగా తీర్చిదిద్దడంలో పోలీసు శాఖ ఎల్లప్పుడూ సహాయ, సహకారాలు అందిస్తుందని తెలిపారు. ఈ కారక్రమంలో జిల్లా మద్యపాన నిషేద, ఆబ్కారీ శాఖ అధికారి పి.శ్రీధర్, జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు, జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణ అధికారి నరేందర్, మంచిర్యాల, బెల్లంపల్లి రాజస్వ మండల అధికారులు వేణు, శ్యామలాదేవి, మున్సిపల్ కమీషనర్లు, మండల పరిషత్ అభివృద్ధి అధికారులు, సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.