వికారాబాదులో ఫుడ్ మేళా రిజిస్ట్రేషన్

Published: Saturday October 02, 2021
డిప్యూటీ ఫుడ్ కంట్రోలర్ టి.విజయ్ కుమార్
వికారాబాద్ బ్యూరో 01 అక్టోబర్ ప్రజాపాలన : వికారాబాద్ జిల్లా పరిధిలోని కిరాణా వ్యాపారస్థులు ఫుడ్ మేళా రిజిస్ట్రేషన్ సద్వినియోగం చేసుకున్నారని డిప్యూటీ ఫుడ్ కంట్రోలర్ టి.విజయ్ కుమార్ అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని శ్రీ రామ మందిర్ ఆవరణలో ఫుడ్ మేళా రిజిస్ట్రేషన్ కార్యక్రమాన్ని వికారాబాద్ జిల్లా కిరాణా మర్చంట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అధ్యక్షుడు బాలకిషన్ డాగా సమక్షంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. డైరెక్టర్ ఆఫ్ ఫుడ్ సేఫ్టీ డాక్టర్ కె.శంకర్ ఆదేశాల మేరకు తెలంగాణ రాష్ట్రంలోనే మొట్ట మొదటి సారిగా వికారాబాద్ జిల్లాలో ఫుడ్ మేళా రిజిస్ట్రేషన్ కార్యక్రమాన్ని చేపట్టామని పేర్కొన్నారు. వికారాబాద్ జిల్లా వికారాబాద్ టౌన్, తాండూర్, పరిగి, కొడంగల్, మోమిన్పేట్, మర్పల్లి, కోట్పల్లి, వ్యాపారస్థులు అందరు ఫుడ్ మేళా రిజిస్ట్రేషన్ ను సద్వినియోగం చేసుకున్నారని వివరించారు. 01 అక్టోబర్  2021 శుక్రవారం నిర్వహించిన ఫుడ్ మేళా రిజిస్ట్రేషన్ లో కొత్త లైసెన్సులు, పాతవి రెన్యూవల్ చేశామని స్పష్టం చేశారు. సాధారణ రిజిస్ట్రేషన్ ఫీజు 500  రూపాయలకు 5 సంవత్సరముల వరకు చేసి అప్పుడే ఇచ్చామని పేర్కొన్నారు. 2000 రూపాయలకు ఒక సంవత్సరం లైసెన్స్ దరఖాస్తు చేసుకున్న రోజే ఇచ్చామని తెలిపారు. అమౌంట్ మొత్తం ఆన్లైన్లో గవర్నమెంట్ వెబ్ సైట్ కు కట్టారని అన్నారు. లైసెన్సు పొందుటకు ఆధార్ కార్డు జిరాక్స్, ఒక పాస్ ఫోటో, ఏదైనా షాప్ రిజిస్ట్రేషన్ లైసెన్సు తప్పనిసరి అని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో గెజిటెడ్ ఫుడ్ ఇన్ స్పెక్టర్ వి.విజయ్ కుమార్, అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్ ఎం.ఏ.ఖలీల్, ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ టి.సునీత, కిరాణా మర్చంట్ అసోసియేషన్ ఉపాధ్యక్షులు కౌకుంట్ల విజయ్ కుమార్, పోకల సతీష్, ఎస్.ఆత్మలింగం, ప్రధాన కార్యదర్శి పి.అంజయ్య తదితరులు పాల్గొన్నారు.