అవినీతి సర్పంచ్ పై సస్పెన్షన్ వేటు

Published: Friday April 22, 2022
సర్వే నంబర్ 216 లోని 37 ఎకరాల వ్యవసాయ భూమిలో అక్రమ వెంచర్
ఎన్ఎఎల్ఎ, డిటిసిపి నియమాలను తుంగలో తొక్కిన సర్పంచ్, కార్యదర్శి
అక్రమ లేఅవుట్ ఊబిలో చిక్కుకున్న కొటాలగూడ సర్పంచ్ రాములు నాయక్, కార్యదర్శి రమాదేవి
వికారాబాద్ జిల్లా కలెక్టర్ నిఖిల సర్పంచ్ రాములు నాయక్, కార్యదర్శి రమాదేవి పై సస్పెన్షన్ వేటు
వికారాబాద్ బ్యూరో 21 ఏప్రిల్ ప్రజాపాలన : ప్రజా సేవే పరమావధిగా భావించే నాయకులు కొందరైతే, దీపం ఉండగానే ఇల్లు సర్దుకోవడం మరికొందరి నాయకుల నైజంగా మారింది. పదవిలో ఉన్నప్పుడే కాసుల మూటలు వెనకేసుకోవడమే లక్ష్యంగా పనితీరు అయ్యింది. సర్పంచుగా ఎన్నికవడమే ధనరాశులకు రెక్కలు తొడిగాయి. వికారాబాద్ మండల పరిధిలోని కొటాలగూడ గ్రామ సర్పంచ్ రాములు నాయక్, పంచాయతీ కార్యదర్శి రమాదేవిలపై జిల్లా కలెక్టర్ సస్పెన్షన్ వేటు వేశారు. కొటాలగూడ గ్రామానికి అనుబంధ గ్రామం లాల్ సింగ్ తండాతో కలిపి కొటాలగూడ జిపిగా ఏర్పడ్డది. కొటాలగూడ గ్రామ సర్పంచుగా రాములు నాయక్ ఎన్నికయ్యాడో అప్పటి నుండే అవినీతికి దారులను అందిపుచ్చుకున్నాడు. సర్పంచుపై ఎన్నో అవినీతి ఆరోపణలు వచ్చినా వాటిని లెక్కచేయకుండా అవినీతినే మార్చుకున్నాడు. అధికారులు ఎన్నిసార్లు హెచ్చరించినా, మందలించినా తన దృష్టి మార్చుకోలేదు. గ్రామాభివృద్ధి పట్ల నిర్లక్ష్యాన్ని వీడాలని పలుమార్లు సూచించినా పెడచెవిన పెట్టారు. కొటాలగూడ గ్రామం, దాని అనుబంధ గ్రామం లాల్ సింగ్ తండాకు సంబంధించిన అభివృద్ధి పనులు, అక్రమ లేఅవుట్ వివరాలను జిల్లా కలెక్టర్ నిఖిల పక్కా సమాచారాన్ని తెప్పించుకున్నారు. కొటాలగూడ అనుబంధ గ్రామం లాల్ సింగ్ తండాలో సయ్యద్ ఇస్మాయిల్ కుమారుడు సయ్యద్ అయానొద్దిన్ ఆరిఫ్ కు సర్వే నంబర్ 216 లో 37 ఎకరాల వ్యవసాయ భూమి కలదు. వ్యవసాయ భూమిలో డిటిసిపి అనుమతి లేకపోయినా సర్పంచ్ అనధికారికంగా తన లెటర్ ప్యాడ్ పై అక్రమ వెంచర్ నిర్మాణానికి అనుమతులు ఇచ్చాడు. పంచాయతీ రాజ్ చట్టం 2018 సెక్షన్ 113, 114 ప్రకారం వ్యవసాయ భూమిలో వెంచర్ ఏర్పాటు చేయకూడదు. ఈ విషయమై సంజాయిషీ కొరకు అధికారులు నోటీసులు పంపారు. వచ్చిన నోటీసుకు సర్పంచు రాములు నాయక్, కార్యదర్శి రమాదేవిల వివరణ సంతృప్తికరంగా లేకపోవడంతో జిల్లా కలెక్టర్ నిఖిల సస్పెన్షన్ వేటు వేశారు. గ్రామంలో పారిశుద్ధ్య పనులు, క్రిమిటోరియం పనులను గాలికొదిలేశారు. పంచాయతీ రాజ్ చట్టం 2018 ప్రకారం సర్పంచ్, కార్యదర్శి లను విధుల నుండి తొలగిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ నిఖిల ఉత్తర్వులు జారీ చేశారు.