మున్నూరు కాపులకు స్థానిక సంస్థల ఎం ఎల్ సి ఎన్నికలలో అవకాశం కల్పించాలి : పుటం పురుషోత్తమ రావు

Published: Thursday November 18, 2021
హైదరాబాద్ (ప్రజాపాలన ప్రతినిధి) : వ్యవసాయ ఆధారితంగా జీవనం సాగిస్తున్న మున్నూరు కాపులకు రానున్న స్థానిక సంస్థల ఎం ఎల్ సి ఎన్నికలలో అవకాశం ఇవ్వాలని ముఖ్యమంత్రి కేసీఆర్ కు విజ్ఞప్తి చేశారు మున్నూరు కాపు సంఘం తెలంగాణ రాష్ట్ర కన్వీనర్ సర్దార్ పుటం పురుషోత్తమ రావు పటేల్. రాష్ట్ర జనాభాలో అధిక శాతం ఉన్న కులాలలో మున్నూరు కాపులు ఒకటని, తెలంగాణ ఉద్యమం సమయంలో సకల జనుల సమ్మెలో, వంటావార్పు లాంటి ప్రతీ ఒక్క సందర్భంలో కేసీఆర్ వెన్నంటి నడిచిన మున్నూరు కాపులకు గవర్నర్ కోటాలో, ఎం ఎల్ ఏ కోటాలో అవకాశం దక్కలేదని కనీసం స్ధానిక సంస్థల ఎన్నికలలో అయినా అవకాశం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ఇప్పటికే గడువు ముగిసిన ఎం ఎల్ సి లలో చాలా మంది మున్నూరు కాపులుండగా, కొత్తగా ఎన్నికైన వారిలో ఒక్కరికి కూడా అవకాశం దక్కకపోవడంతో మున్నూరు కాపు కులస్తులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారన్నారు. అలాగే మున్నూరు కాపులకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో కొండా దేవయ్య పటేల్, మనోజ్ కుమార్, ఆకుల వీరాస్వామి, సుమిత్ పటేల్ తదితరులు పాల్గొన్నారు.